విశాఖపట్నం: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసు వరుస ట్విస్ట్ లు ఇస్తోంది. నిందితు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత శనివారం రహస్య ప్రదేశంలో విచారించిన ఎన్ఐఏ అధికారులు కోర్టు ఆదేశాలతో దిగొచ్చారు. 

ఆదివారం నుంచి జరిగే విచారణ నిందితుడు శ్రీనివాసరావు తరుపు న్యాయవాది సలీమ్ సమక్షంలోనే జరపనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో న్యాయవాది సలీమ్ కు ఎన్ఐఏ అధికారులు సమాచారం ఇచ్చారు. 

విశాఖపట్నం జిల్లా బక్కన్నపాలెంలోని సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ లో ఉంచినట్లు లాయర్ సలీమ్ కు ఎన్ఐఏ అధికారులు సమాచారం ఇచ్చారు. సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ కు రావాల్సిందిగా ఆదేశించారు. ఎన్ఐఏ అధికారుల సమాచారంతో నిందితుడి తరుపున లాయర్ అబ్దుస్ సలీమ్ సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ కు బయలు దేరారు. 

జగన్ పై హత్యాయత్నం కేసును విచారిస్తున్న ఎన్ఐఏ అధికారులు నిందితుడు శ్రీనివాస్ ను కస్టడీలోకి ఇవ్వాలంటూ ఎన్ఐఏ కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు వారం రోజులపాటు శ్రీనివాస్ ను కస్టడీకి అనుమతినిచ్చింది. అలాగే కొన్ని షరతలు విధించింది. 

విచారణ సమయంలో నిందితుడు శ్రీనివాస్ పై ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని, అలాగే మూడురోజులకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని, నిందితుడు కోరితే అతని తరుపున న్యాయవాది సమక్షంలోనే విచారణ జరపాలని ఆదేశించింది. 

అయితే ఎన్ఐఏ అధికారులు శనివారం నిందితుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడ నుంచి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి విచారించారు. రహస్య ప్రదేశంలో శ్రీనివాసరావును విచారించడంపై ఆయన తరుపున న్యాయవాది అబ్దుస్ సలీమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జగన్ పై దాడికేసులో విచారణ చేపడుతున్న ఎన్ఐఏ వ్యవహార శైలిపై నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది సలీం కంటెప్ట్ ఆఫ్ కోర్టు కింద సెషన్స్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. నిందితుడు శ్రీనివాసరావును లాయర్ సమక్షంలో విచారించే వెసులుబాటు కల్పిస్తూ ఎన్ఐఏ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకొచ్చారు. 

అయితే విచారణ పేరుతో శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు రహస్య ప్రదేశంలోకి తీసుకు వెళ్లారని కనీసం ఎక్కడకు తీసుకెళ్లారో కూడా చెప్పడం లేదని ఆయన ఫిర్యాదు లో పేర్కొన్నారు. తక్షణమే నిందితుడి ఎక్కడ ఉన్నా తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.   

న్యాయవాది సలీమ్ కోర్టుకెక్కడంతో ఎన్ఐఏ అధికారులు దిగొచ్చారు. ఇకపై న్యాయవాది అబ్దుస్ సలీమ్ సమక్షంలోనే విచారించాలని నిర్ణయించారు. ఈ వారం రోజులపాటు నిందితుడి తరపున న్యాయవాది సమక్షంలోనే విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే వరుస ట్విస్ట్ లు ఇస్తున్న జగన్ పై దాడి కేసు ఇంకెన్ని ట్విస్ట్ లు ఇస్తుందో వేచి చూడాలి. 
 

 ఈ వార్తలు కూడా చదవండి

జగన్ కేసులో ట్విస్ట్ : కోర్టుకెక్కిన శ్రీనివాస్ తరుపు న్యాయవాది

జగన్ పై దాడికేసులో ఎన్ఐఏ దూకుడు: రహస్య ప్రదేశానికి శ్రీనివాస్

జగన్‌పై దాడి కేసు...నార్కో పరీక్షకు సిద్దమే: నిందితుడి తరపు లాయర్

జగన్ పై దాడి కేసు: ఎన్ఐఏ కస్టడీకి నిందితుడు శ్రీనివాస్

జగన్ పై దాడి కేసు: హాజరు కానీ శ్రీనివాస్ తరపు లాయర్, 25కు వాయిదా

ఎన్ఐఏకు జగన్‌పై దాడి కేసు: హైకోర్టులో బాబు సర్కార్ పిటిషన్

జగన్ దాడి కేసు: విజయవాడకు నిందితుడు శ్రీనివాస్