విజయవాడ: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ దూకుడు ప్రదర్శిస్తోంది. హైకోర్టు, కేంద్రప్రభుత్వం ఆదేశాలతో కేసు నమోదు చేసిన ఎన్ఐఏ కేసును విశాఖపట్నం మెట్రోపాలిటన్ కోర్టు నుంచి విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేయించింది.

అలాగే నిందితుడు శ్రీనివాస్ ను వారం రోజులపాటు కస్టడీ కోరింది. దీంతో ఎన్ఐఏ కోర్టు నిందితుడు శ్రీనివాస్ ను వారం రోజులపాటు ఎన్ఐఏ కస్టడీకి అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. 

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య  పరీక్షలు నిర్వహించారు. వైద్యపరీక్షల అనంతరం అతడిని రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లారు ఎన్ఐఏ అధికారు. రహస్య ప్రదేశంలో శ్రీనివాస్ ను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు.

ఇకపోతే ఎన్ఐఏ కస్టడీకి నిందితుడు శ్రీనివాసరావును అప్పగించే విషయంలో ఎన్ఐఏ కోర్టు పలు కీలక సూచనలు చేసింది. నిందితుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని మూడురోజులకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని కూడా సూచించింది. నిందితుడు కోరితే అతని లాయర్ సమక్షంలోనే విచారణ జరపాలని స్పష్టం చేసింది. 

ఎన్ఐఏ కోర్టు ఆదేశాల మేరకు నిందితుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై శ్రీనివాసరావు కత్తితో దాడికి పాల్పడ్డాడు.