ఆంధ్ర ప్రదేశ్లో సంచలనం సృష్టించిన వైఎస్సార్సిపి  అధినేత జగన్ హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాస్ నార్కో అనాలిటిక్ పరీక్షలకు సిద్దంగా వున్నట్లు అతడి తరపు న్యాయవాది సలీం తెలిపారు. కేవలం తన పేరు సంచలనంగా మారడం కోసమే శ్రీనివాస్ జగన్ పై దాడికి పాల్సడ్డాడని...ఇందులో ఎలాంటి కుట్ర, రాజకీయ కక్షసాధింపులు లేవని సలీం  వెల్లడించారు. 

ఇవాళ విజయవాడ సబ్ జైల్లో శ్రీనివాస్‌ను కలుసుకున్న సలీం పలు అంశాలపై అతడితో చర్చించారు. ఇటీవల ఈ కేసులో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అతడికి వివరించి... తదుపరి న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో తెలిపారు. ఈ సందర్భంగా నార్కో పరీక్ష గురించి శ్రీనివాస్‌ను అడగ్గా అందుకు తాను సిద్దమేనని తెలిపినట్లు సలీం పేర్కొన్నారు. 

ఇక ఇటీవలే ఈ కేసు విచారణను ఎన్ఐఏకు అప్పగిస్తూ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఎన్‌ఐఏ దర్యాప్తులో నిజానిజాలు వెలుగు చూస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు ఎన్‌ఐఏ అధికారులు వారం రోజుల పాటు నిందితుడిని విచారించనున్నారని....ఆ విచారణ తన సమక్షంలోనే జరగాలని డిమాండ్‌ చేశారు. నిందితుడు కోరితే న్యాయవాది సమక్షంలోనే విచారణ జరిపించాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో తనను విచారణ సమయంలో అనుమతించాలని ఎన్ఐఏ అధికారులను సలీం కోరారు.   

శ్రీనివాస్ను వారం రోజులపాటు కస్టడీకీ అప్పగిస్తూ ఎన్ఐఏ కోర్టు అనుమతిస్తూనే పలు షరతులు విధించింది. ఈ కేసు విచారణలో  థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదని కోర్టు ఆదేశించింది. విచారణలో భాగంగా ప్రతీ 3రోజులకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు సూచించింది.   

సంబంధిత వార్తలు

జగన్ పై దాడి కేసు: ఎన్ఐఏ కస్టడీకి నిందితుడు శ్రీనివాస్

జగన్ పై దాడి కేసు: హాజరు కానీ శ్రీనివాస్ తరపు లాయర్, 25కు వాయిదా

ఎన్ఐఏకు జగన్‌పై దాడి కేసు: హైకోర్టులో బాబు సర్కార్ పిటిషన్

జగన్ దాడి కేసు: విజయవాడకు నిందితుడు శ్రీనివాస్