విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు, కేంద్రప్రభుత్వం ఆదేశాలతో కేసు నమోదు చేసిన నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తును వేగవంతం చేసింది. 

కేసు విచారణలో భాగంగా నిందితుడు జె.శ్రీనివాస్ ను విజయవాడ ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచారు ఎన్ఐఏ అధికారులు. అయితే కోర్టు విచారణకు శ్రీనివాసరావు తరపున న్యాయవాది సలీం హాజరుకాకపోవడం విశేషం. 

నిందితుడు శ్రీనివాసరావు తరపున వాదించేందుకు సలీం ఎన్ఐఏ కోర్టుకు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే జగన్ పై దాడి కేసుపై కోర్టులో వాదనలు జరిగాయి. వాదనల కోర్టు కేసు విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది. అయితే శ్రీనివాసరావు కస్టడీ పిటీషన్ ను ఎన్ఐఏ కోర్టు పెండింగ్ లో పెట్టింది. 

నిందితుడు శ్రీనివాస్ ను కోర్టుకు హాజరుపరిచిన అనంతరం పోలీసులు విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. విచారణకు మాత్రమే విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు తీసుకురానున్నారు ఎన్ఐఏ అధికారులు.