అమరావతి:  వైఎస్ఆర్ పెన్షన్ పథకాన్ని తీసుకొస్తున్నట్టుగా ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత వృద్దుల పెన్షన్‌ను  రూ. 3 వేలకు పెంచుతామన్నారు.  ఈ ఏడాది పెన్షన్‌ను రూ. 2250 నుండి ఐదేళ్లలో పెన్షన్‌ను రూ. 3 వేలకు పెంచుతామని జగన్ హామీ ఇచ్చారు.ఈ మేరకు జగన్ పెన్షన్ పెంపుకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు.

గురువారం నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ ప్రసంగించారు. పాదయాత్రలో ప్రజల బాధలను ప్రత్యక్షంగా చూసినట్టుగా జగన్ గుర్తు చేసుకొన్నారు.పాదయాత్రలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

పెన్షన్  కేవలం  వెయ్యి రూపాయాలు మాత్రమే ఉన్న విషయాన్ని తన దృష్టికి రావడంతో.... ఎన్నికల మేనిఫెస్టోలో రూ. 3 వేలకు పెంచుతామని హామీ ఇచ్చామన్నారు. ఈ హమీ మేరకు పెన్షన్‌ను పెంచుతామన్నారు. ఈ ఏడాది రూ.2250 వచ్చే ఏడాది రూ.2500, ఆ తర్వాత ఏటా రూ.2750 ఇలా పెంచుతూ ఐదేళ్లలో రూ.3 వేలకు పెన్షన్లను పెంచుతామని జగన్ హమీ ఇచ్చారు. ఈ మేరకు ఈ ఫైలుపై జగన్ సంతకం చేశారు. పెంచిన పెన్షన్‌ను జూన్ మాసం నుండి అందిస్తామని జగన్ ప్రకటించారు.

గత పాలకులు, ప్రభుత్వాల మాదిరిగా పేజీల కొద్ది మేనిఫెస్టోను తయారు చేయలేదన్నారు. మేనిఫెస్టో‌ను కేవలం రెండు పేజీలతోనే తీసుకొచ్చినట్టుగా ఆయన చెప్పారు.

ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. మేనిఫెస్టోను ఖురాన్, భగవద్దీత, బైబిల్‌గా భావిస్తానని ఆయన ప్రకటించారు.మాట ఇచ్చిన ప్రకారంగా నవరత్నాలను కచ్చితంగా అమలు చేస్తానని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

సీఎం ఆఫీసులో కాల్ సెంటర్‌, ఏడాదిలోపు అవినీతి అంతం: జగన్

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం