అమరావతి: అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేశారు.

గురువారం నాడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిఫల్ స్టేడియంలో  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు.గురువారం మధ్యాహ్నం 11 గంటల 55 నిమిషాలకు జగన్ తన ఇంటి నుండి ఇందిరాగాంధీ మున్సిఫల్ స్టేడియానికి చేరుకొన్నారు. ఓపెన్ టాప్ జీపులో జగన్  ప్రజలకు అభివాదం చేస్తూ సభా వేదికపైకి చేరుకొన్నారు.

వేదికపైకి చేరుకొన్న జగన్ ప్రజలకు అభివాదం చేశారు. స్టేడియం నలువైపులా తిరిగి జగన్ ప్రజలకు అభివాదం చేశారు. ముహుర్తానికి ఒక్క నిమిషం ముందుగానే గవర్నర్ నరసింహాన్ దంపతులు వేదికపైకి చేరుకొన్నారు. గవర్నర్ నరసింహాన్ జగన్ ను ఆలింగనం చేసుకొని అభినందించారు. ఆ తర్వాత జగన్‌తో గవర్నర్ నరసింహాన్ ప్రమాణం చేయించారు.

జగన్ స్టేడియానికి చేరుకోవడానికి ముందే వైఎస్ విజయమ్మ వేదికపైకి వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకె చీఫ్ స్టాలిన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

డీఎంకె చీఫ్ స్టాలిన్‌కు జగన్ సోదరి షర్మిల తన తల్లి విజయమ్మ, వదిన వైఎస్ భారతిని పరిచయం చేశారు.స్టాలిన్ వచ్చిన కొద్ది క్షణాలకే తెలంగాణ సీఎం వేదికపైకి వచ్చారు. స్టాలిన్‌ను  కేసీఆర్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకొన్నారు.

జగన్‌తో ప్రమాణం చేయించిన తర్వాత గవర్నర్ నరసింహాన్ ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన డీఎంకె చీఫ్ స్టాలిన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లను పలకరించారు. ఆ తర్వాత జగన్ కుటుంబసభ్యులను గవర్నర్ దంపతులు పలకరించారు. ఏపీ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జగన్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకె చీఫ్ స్టాలిన్ లు అభినందించారు.