జగన్ అక్రమాస్తుల కేసులో ట్విస్ట్: ముద్దాయిగా భారతి

YS Bharathi as accused in YS Jagan case
Highlights

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో తొలిసారి ఆయన సతీమణి భారతిపై అభియోగాలు నమోదయ్యాయి. 

హైదరాబాద్‌: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో తొలిసారి ఆయన సతీమణి భారతిపై అభియోగాలు నమోదయ్యాయి. భారతీ సిమెంట్స్‌లో క్విడ్‌ప్రో కో పద్ధతిలో జరిగిన పెట్టుబడుల వ్యవహారంలో జగన్‌తోపాటు భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇటీవల చార్జిషీటు దాఖలు చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. 

భారతీ సిమెంట్స్‌లో పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే సీబీఐ మూడు చార్జిషీట్లు (సీసీ 14/2012, సీసీ 24/2013, సీసీ 25/2013) దాఖలు చేసింది. ఈడీ తన చార్జీషీటులో మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈ అభియోగపత్రం దాఖలు చేసింది. దీన్ని విచారణకు స్వీకరిస్తే నిందితులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. 

ఇప్పటి వరకు సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లపై విచారణలో భాగంగా జగన్‌ ప్రతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరవుతున్నారు. భారతి సిమెంట్స్‌లో మనీలాండరింగ్‌పై ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదును కూడా కోర్టు విచారణకు స్వీకరించి సమన్లు జారీచేస్తే జగన్‌, భారతి ఇద్దరూ వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందు హాజరుకావాల్సి ఉంటుంది.
 
ఫార్మా కంపెనీలకు సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి దర్యాప్తు పూర్తిచేసి ఇప్పటికే  ఈడి చార్జిషీట్ చేసింది. తాజాగా భారతీ సిమెంట్స్‌కు సంబంధించిన అక్రమ లావాదేవీలపై అభియోగపత్రం దాఖలు చేసింది. సీబీఐ సమర్పించిన 11 చార్జిషీట్ల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే మరిన్ని అభియోగపత్రాలు దాఖలు చేసే అవకాశం ఉందని ఈడీ అధికారులు అంటున్నారు. 

ఈడీ తన చార్చిషీటులో జగన్‌, భారతితోపాటు ఆడిటర్‌, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి, భారతి సిమెంట్స్‌ కార్పొరేషన్‌, జెల్లా జగన్‌మోహన్‌ రెడ్డి (జేజే రెడ్డి), సిలికాన్‌ బిల్డర్స్‌, సండూర్‌ పవర్‌, క్లాసిక్‌ రియాలిటీ, సరస్వతి పవర్‌, క్యాప్‌స్టోన్‌ ఇన్‌ఫ్రా, యూటోపియా ఇన్‌ఫ్రా, హరీశ్‌ ఇన్‌ఫ్రా, సిలికాన్‌ ఇన్‌ఫ్రా, రేవన్‌ ఇన్‌ఫ్రా, భగతవ్‌ సన్నిధి ఎస్టేట్స్‌తోపాటు గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్‌, ఐబీఎంకు చెందిన వి.ప్రభు షెట్టార్‌, మాజీ ఐఏఎస్‌ కృపానందం, గనుల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌.శంకర నారాయణను నిందితులుగా పేర్కొంది.

loader