పోలీసుల టార్చర్ భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
కర్నూల్ : ప్రేమికులకు సాయం చేసాడని అనుమానిస్తూ ఓ యువకుడిని పోలీసులు చితకబాదగా... అవమానంగా భావించిన అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్నేహితుడి లవ్ మ్యారేజ్ కు సహకరించాడని యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచక్షణారహితంగా కొట్టారట. ఈ దెబ్బలు తాళలేకపోవడంతో పాటు పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టడం అవమానంగా భావించాడు. పెళ్లిచేసుకున్న యువతీయువకుడిని వదిలిపెట్టి వారికి సహకరించాడంటూ పోలీసులు టార్చర్ చేయడం తట్టుకోలేకపోయాడు. దీంతో యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన కర్నూల్ జిల్లాలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే... కర్నూల్ జిల్లా హాలహర్వి మండలం విరుపాపురం గ్రామానికి చెందిన యువతీ యువకుడు ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో పారిపోయి పెళ్లిచేసుకున్నారు. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నక్రమంలో యువతీయువకుల లవ్ మ్యారేజ్ కు అదే గ్రామానికి చెందిన రఫీక్ సాయంచేసి వుంటాడని కొందరు అనుమానం వ్యక్తం చేసారు. దీంతో రఫీక్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించి చితకబాదారు.
తమ కొడుకును పోలీసులు టార్చర్ చేయడం చూసి తట్టుకోలేక విడిచిపెట్టాలని హాలహర్వి ఏఎస్సైని బాధిత తల్లిదండ్రులు కోరారట. ఇలా రఫీక్ ను విడిచిపెట్టాలంటూ రూ.30 వేలు డిమాండ్ చేయగా ఆ మొత్తాన్ని కూడా ఇచ్చినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. అయినా తమ బిడ్డను విడిచిపెట్టకుండా పోలీసులు టార్చర్ చేస్తూనే వున్నారని... ఇది భరించలేక అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధిత తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటూ చెబుతున్నారు.
Read More హైదరాబాద్ లో కస్టోడియల్ డెత్ : పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు మృతి.. గోప్యంగా ఉంచడంతో అనుమానాలు..
పోలీసుల వేధింపులు భరించలేక రఫీక్ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నొప్పితో విలవిల్లాడిపోతున్న కొడుకును గమనించిన తల్లిదండ్రులు హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రఫీక్ పరిస్థితి విషమంగానే వున్నట్లు తెలుస్తోంది. విచారణ పేరిట టార్చర్ చేసి ఆత్మహత్యకు కారణమైన పోలీసులను చర్యలు తీసుకోవాలని బాధితుడి తల్లిదండ్రులు కోరుతున్నారు.
(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)
