రాష్ట్రంలో ప్రత్యేకహోదా డిమాండ్ మళ్ళీ ఊపిరి పోసుకుంటోందా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తాజాగా తెలుగుసినీ పరిశ్రమ నుండి ప్రత్యేకహోదాపై డిమాండ్ మొదలైంది. యువహీరో నిఖిల్ సిద్దార్ధ ఏపికి ప్రత్యేకహోదా రావాల్సిందేనంటూ గట్టిగా అభిప్రాయపడ్డారు. కొన్ని ప్రత్యేకమైన విషయాలపై స్పందించడానికి కేవలం రాజకీయ నాయకులే కానక్కర్లేదని నిఖిల్ అన్నారు. ట్వట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కి నిరాశే ఎదురవడంతో నటుడు నిఖిల్ తన వంతుగా గళం విప్పినట్లుంది. ఏపి అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నానని, అది ప్రత్యేక హోదాతో పాటు కేంద్రం నిధుల వల్ల మాత్రమే సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. కొందరు తనను 'నీకు ఏపీకి ప్రత్యేక హోదా' లాంటి విషయాలు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారని తెలిపారు.

 

ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కేంద్ర నుంచి రాష్టానికి ప్రత్యేక సాయం అందాలన్నా, ఏపీలో మరింత అభివృద్ధి జరగాలన్నా హోదాతోనే సాధ్యమవుతుందని తెలుసుకున్నట్లు చెప్పారు. తెలుగు వ్యక్తిగా, ఓ భారతీయుడిగా అభివృద్ధి కోరుకుంటున్నాను. ‘కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ నిధులు వచ్చినప్పుడే ఏపీలో అభివృద్ధికి ఆస్కారం ఉంటుంద’ని నిఖిల్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తుందంటూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు.