హైదరాబాద్: బిజెపి నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరిలతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీకి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ) కొత్త ట్విస్ట్ ఇస్తోంది. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న రమేష్ కుమార్ బిజెపి నేతలను వ్యక్తిగతంగా కలవడాన్ని తన అస్త్రంగా మలుచుకుంటుంది. ఇందుకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు చెందిన సాక్షి మీడియాలో వార్తాకథనం అచ్చయింది. 

సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ బిజెపి నేతలే అయినప్పటికీ ఈ వ్యవహారంలోకి టీడీపీ అధినేత చంద్రబాబును లాగాలని వైసీపీ భావిస్తున్నట్లు అర్థమవుతోంంది. సుజనా చౌదరి బిజెపిలో చేరి చంద్రబాబు ప్రయోజనాలను కాపాడడానికి ప్రయత్నిస్తున్నారని, చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చాలా కాలంగా వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఆయనను చంద్రబాబు సన్నిహిత నేతగా చెబుతూ వస్తోంది. ఇప్పుడు కామినేని శ్రీనివాస్ ను కూడా అదే గాటన కట్టేయాలని చూస్తోంది. 

Also Read: కామినేని, సుజనాలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ రహస్య భేటీ, కారణం

హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్లో ఈ నెల 13వ తేదీన ముగ్గురి మధ్య గంటన్నర పాటు చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. వీరు ముగ్గురు పార్క్ హయత్ లోకి వచ్చిన, ఒకే గదిలోకి వెళ్లిన దృశ్యాలకు సంబంధించిన వీడియో బయటకు రావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని స్వయంగా జగన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కులాన్ని కూడా ప్రస్తావించి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారనే వాదనకు తాజా సంఘటనను వైసీపీ మరింత పదును పెట్టడానికి సిద్ధమైంది. 

చంద్రబాబు ప్రయోజనాల కోసమే సుజనా, కామినేని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో భేటీ అయ్యారనే ట్విస్టును వైసీపీ ఇస్తోంది. వారిద్దరు బిజెపి నేతలే అయినప్పటికీ చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారనే వాదనను వైసీపీ ముందుకు తెస్తోంది. 

కేసు కోర్టులో ఉన్న ప్రస్తుత తరుణంలో నిమ్మగడ్డ రమేష్ బిజెపి నేతలను కలవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుందని అంటున్నారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి ఈ రహస్య భేటీలేమిటనే ప్రశ్న రమేష్ కుమార్ పై ఎక్కుపెడుతున్నారు. వారేం చర్చించారనేది తెలియకపోయినప్పటికీ భేటీయే నైతికంగా రమేష్ కుమార్ విషయంలో సరైంది కాదనే వాదన వినిపిస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైసీపీకి అడ్డంగా దొరికిపోయాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.