ఆంధ్రప్రదేశ్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో జరుగుతున్న రచ్చ గురించి వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి సంబంధించిన ఒక వీడియో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

నిమ్మగడ్డ 13వ తేదీనాడు రాత్రి హైదరాబాద్ లోని ఒక హోటల్ లో బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్ రావు, సుజనా చౌదరీలతో భేటీ అయినట్టుగా ఈ వీడియో ఆధారంగా తెలుస్తుంది. దీనిపై వైసీపీ నేతలు రమేష్ కుమార్ పై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. 

సీసీ ఫుటేజ్ వీడియోలో ఈ నెల 13వ తేది రాత్రి10:47 కు సుజనా చౌదరి, 11.23 కు కామినేని, 11.44కు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ హోటల్‌కి వచ్చినట్టుగా రికార్డు అయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఆ ముగ్గురినీ ఒకరే రిసీవ్ చేసుకున్నారు. ఆ తరువాత ఒకే గదిలో దాదాపు గంటకు పైగా ఆ ముగ్గురు చర్చలు సాగించినట్టుగా ఆ వీడియో ఆధారంగా తెలుస్తుంది. 

ఈ వీడియోపై వైసీపీ నేతలు రమేష్ కుమార్ పై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానంటూ, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాను అని చెప్పుకునే రమేష్ కుమార్ ఇలా చేయడమేమిటని  వారు ధ్వజమెత్తుతున్నారు. 

రాష్ట్రప్రభుత్వం పై రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీవ్రమైన ఆరోపణలు చేయడానికి, ఆ ఆరోపణల వెనుక కుమ్మక్కు ఉంది అని అనడానికి ఇది బలమైన సాక్ష్యమని వారు అభివర్ణిస్తున్నారు. కోర్టులో కేసులు నడుస్తున్నసమయంలో ఇలా అదే కేసుకు సంబంధించి పిల్ దాఖలు చేసిన వ్యక్తితో చర్చలు ఏమిటని వారు ఫైర్ అవుతున్నారు.