చంద్రబాబు రాజకీయ మాంసాహారని ఎద్దేవా చేసిన వైసీపీ చంద్రబాబు తమ ఎమ్మెల్యేలను మింగేసారని ఆరోపించిన అంబటి సిగ్గుతో తలదించుకోవాల్సిందిపోయి చంద్రబాబు బుకాయిస్తున్నారన్న అంబటి
చంద్రబాబు నాయుడు రాజకీయ మాంసాహారిగా వైసీపీ ఎద్దేవా చేసింది. శనివారం మీడియా సమావేశంలో వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఆలయ భూములకు ధర్మకర్తగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం వాటిని కాజేయాలనుకుందని అంబటి ఆరోపించారు. మద్రాసులోని భూములను కాజేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు గడించాలనుకున్నారన్నారు. సదావర్తి భూములను లోకేష్ దోచుకునే ప్రయత్నం చేశారన్న విషయం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. ఈ విషయంలో చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాల్సింది పోయి బుకాయిస్తున్నారన్నారు.
చంద్రబాబు తాను శాకాహారిని అంటూ చెబుతుంటాడని.. ఆయన ఏ ఆహారం తీసుకుంటే మాకేంటని ప్రశ్నించారు. ఆయన పేరుకే శాకాహారని.. రాజకీయంగా మాత్రం మాంసాహారని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన 21మంది ఎమ్మెల్యేలను మింగేసిన చంద్రబాబు శాకాహారా ఎలా అవుతారని ప్రశ్నించారు. మట్టి, ఇసుక, భూములను, రూ.లక్షల కోట్లను కాజేసే చంద్రబాబు.. కచ్చింతగా మాంసాహారేనని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అహకారంతో వ్యవహరిస్తున్నారని చెప్పారు. నిత్యజీవితంలో శాకాహారం తీసుకుంటూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్న చంద్రబాబు.. రాజకీయపరంగ మాత్రం రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని మండిపడ్డారు.
పోతిరెడ్డిపాడు నీటి వినియెగంపై సాక్షితోపాటు తెలుగు, జాతీయ పత్రికలు వార్తలు రాశాయని తెలిపారు. తెలంగాణ పత్రికలు తెలంగాణ వాదనలు రాయడం తప్పా? అని అంబటి ప్రశ్నించారు. సాక్షి పత్రిక ఒక వార్త రాస్తే.. అది జగన్ రాసినట్టు ఆపాదించడం సరైంది కాదన్నారు. ఇకనైనా జగన్ పై అవాకులు చవాకులు మానుకోవాలని సూచించారు.
చంద్రబాబు రాజధానిని అద్భుతంగా నిర్మిస్తానని ఎప్పటి నుంచో చెబుతున్నాడని.. కానీ ఇప్పటి వరకు మొదలు కూడా పెట్టలేదని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణ పనుల బాధ్యత ఓ సినిమా డైరెక్టర్ కి అప్పగించే స్థాయికి చంద్రబాబు దిగజారాడన్నారు. అమరావతి డిజైన్ల ఎంపికపై రాజమౌళిని నియమించడమేంటి అని ప్రశ్నించారు. పాక్ తో యుద్ధం వస్తే ఆర్మీని బదులు సినిమా హీరోలను పంపించేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. మీ కుమారుడు లోకేష్, బావమరిది బాలకృష్ణను పెట్టి రాజమౌళి సినిమా తీయగలను అని చెప్పాలన్నారు. ఈ విషయాలన్నింటినీ చూస్తుంటే తమకు చంద్రబాబు మానసిక స్థితిపై మాకు అనుమానాలున్నాయని రాంబాబు అన్నారు.
