వైసిపి ఎంఎల్ఏలను అరెస్టు చేసేందుకు చంద్రబాబునాయుడు కుట్ర  చేస్తున్నారా? వైసిపి ఎంఎల్ఏలను ఎందుకు అరెస్టు చేయాలి? అంటే, వచ్చే నెలలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధులను గెలిపించుకునేందుకు వైసిపి ఎంఎల్ఏల్లో కొందరి అరెస్టుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారట. వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ మేరక కేంద్ర ఎన్నికల కమీషన్ వద్ద చంద్రబాబుపై ఫిర్యాదు కూడా చేశారు.

సిఇసిని కలిసిన తర్వాత విజయసాయి మీడియాతో మాట్లాడుతూ, రాజ్యసభ ఎన్నికల సమయంలో కొంత మంది ఎమ్మెల్యేలను అరెస్ట్‌ చేయాలని కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష ఎమ్మెల్యేలను అధికార టీడీపీ ప్రలోభాలకు గురి చేస్తోందని కేంద్ర ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతి పాల్పడుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటోందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తోందన్నారు.

తమ పార్టీకి చెందిన 67 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 23 మందిని రూ. 10 నుంచి 20 కోట్లు ఇచ్చి టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. మిగతా 44 మందిలో కనీసం నలుగుర్ని కొనాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లు ఆఫర్‌ చేసినట్టు మా దృష్టికి వచ్చిందని తెలిపారు. అదే విషయాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

ముందు జాగ్రత్తగా రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ ను ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో పెట్టాలని, కేంద్ర బలగాలతో తమ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులు పెట్టకుండా చూడాలని, ప్రత్యేక పరిశీలకుడిని నియమించి ఎన్నికలను పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో తెలంగాణలో ‘ఓటుకు నోటు’ కేసులో చంద్రబాబు ఇరుకున్న సంగతిని విజయసాయి గుర్తు చేశారు. అలాగే ఏపీ ప్రభుత్వ చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కేంద్రం నిఘా పెట్టాలని కోరినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.