Asianet News TeluguAsianet News Telugu

కేంద్రం చంద్రబాబును నమ్మటం లేదా?

  • క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.
Ycp mp says modi has no belief on chandrababu

కేంద్రప్రభుత్వం చంద్రబాబునాయుడును నమ్మటం లేదా? అందుకనే రాష్ట్రప్రయోజనాలు, విభజనచట్టం హామీల అమలు విషయంలో మొండిగా వ్యవహరిస్తోందా? క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. వైసిపి ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని చెప్పారు. చంద్రబాబుపై ప్రధానమంత్రి నరేంద్రమోడికి నమ్మకం లేదు కాబట్టే ఏపిని కేంద్రం పట్టించుకోవటం లేదన్నారు.

ఎందుకంటే, ఇప్పటి వరకూ కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగమైందన్న విషయం కేంద్రానికి అర్ధమైందన్నారు. అందుకనే చంద్రబాబు కూడా నిధుల ఖర్చుపై కేంద్రానికి సక్రమంగా లెక్కలు చెప్పటం లేదన్నారు. కాబట్టి కేంద్రం నుండి రాష్ట్రానికి ఏమీ రాదని తేలిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఏపి ప్రయోజనాలు, విభజన హామీల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోదన్న విషయం అర్ధమైపోయింది.

బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ వైఖరితోనే ఆ విషయం కన్ఫర్మ్ అయ్యింది. నాలుగు రోజులుగా ఆందోళనలు జరుగుతున్నా తాజాగా పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్రమోడి కూడా జైట్లీ వైఖరినే సమర్ధించటంతో విషయం పూర్తిగా అర్ధమైపోయింది. దానికితోడు చంద్రబాబునాయుడు, టిడిపి ఎంపిల డబుల్ గేమ్ కేంద్రానికి బాగా కలసి వస్తోంది. అందుకనే రాష్ట్రంలో అంత ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నా కేంద్రం ఏమాత్రం లెక్క చేయటం లేదు.

కేంద్రం నుండి విభజన హామీలు, రాష్ట్రప్రయోజనాలకు సంబంధించి ఒక్క మాట కూడా ప్రధానితో చెప్పించలేకపోయారు. అయినా కేంద్రం ప్రభుత్వంలో నుండి బయటకు వచ్చేయటానికి చంద్రబాబు ఆలోచించకపోవటమే కేంద్రానికి అలుసైపోయింది. కనీసం కేంద్రమంత్రులతో రాజీనామాలన్నా చేయిస్తే కేంద్రంపై ఏదో ఒకరకంగా ఒత్తిడిపెరిగేదే.

ఇప్పటికిప్పుడు టిడిపికి చెందిన కేంద్రమంత్రులు రాజీనామాలు చేసినంత మాత్రాన ప్రధాని ఆమోదిస్తారని ఎవరూ అనుకోవటం లేదు. నిరసన తెలపటానికి, ఒత్తిడి పెంచటానికి రాజీనామాలు ఒక అస్త్రంగా ఉపయోగపడేది. కేంద్రమంత్రివర్గంలో నుండి బయటకు వచ్చేస్తే వెంటనే చంద్రబాబుపై మోడి గనుక కన్నెర్ర చేస్తే అంతే సంగతులు. అందుకే రాజీనామా అన్న అస్త్రం తప్ప మిగిలిన అన్నీ విషయాలు మాట్లాడుతున్నారు చంద్రబాబు. మంత్రిపదవులకే రాజీనామాలు చేయించలేని చంద్రబాబు ఇక భారతీయ జనతా పార్టీతో పొత్తు తెంచుకునే విషయంలో ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుంటారని ఎవ్వరూ అనుకోవటం లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios