మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో తన స్టేట్ మెంట్ ను సిబిఐ మార్చిందంటూ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం తెలంగా హైకోర్టును ఆశ్రయించడంపై ఎంపీ రఘురాామ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.  

న్యూడిల్లి : ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎస్, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలుచేసిన విషయం తెలిసిందే. తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు సీబీఐ సమర్పించిన వాంగ్మూలం భిన్నంగా ఉందంటూ అజయ్ కల్లం హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

ఏపీ చీఫ్ సెక్రటరీగా పనిచేసినా అజయ్ కల్లంపై చిన్న అవినీతి మరకకూడా లేదని రఘురామ అన్నారు. తన విధులను సక్రమంగా నిర్వహిస్తూ రాష్ట్రానికి ఎనలేని సేవ చేసాడని అన్నారు. కానీ ఆయన కూడా నాలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే మాయగాడి వలలో పడ్డారని రఘురామ అన్నారు. ఆ మాయలోనే సిబిఐకి ఇచ్చిన స్టేట్ మెంట్ ను మార్చారంటూ మాట్లాడుతున్నారని... కానీ  సుప్రీంకోర్టులో సీబీఐ అధికారులు ఇచ్చే ఆధారాల్లో మార్పు ఉండదన్నారు. వైసిపి పెద్దల ఒత్తిడితోనే సిబిఐ తన స్టేట్ మెంట్ మార్చిందంటూ అజయ్ కల్లం కోర్టుకు వెళ్లాడని ఎంపీ రఘురామ పేర్కొంటున్నారు. 

Read More  ఏపీ ప్రజల డేటా అంతా తెలంగాణకు... భారీ కుట్ర జరుగుతోంది : బోండా ఉమ సంచలనం

అజయ్ కల్లం ఏమన్నారంటే:     

 మాజీ  మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి 2023 ఏప్రిల్ 9న సీబీఐ తన స్టేటమ్‌మెంట్ రికార్డు చేసిందని అజయ్ కల్లం తెలిపారు. అయితే తన స్టేట్‌మెంట్‌కు సీబీఐ సమర్పించిన వాంగ్మూలం  భిన్నంగా ఉందని పేర్కొన్నారు.   తాను చెప్పింది  ఒక్కటైతే.. సీబీఐ దాన్ని మార్చి చార్జ్‌షీట్‌లో మరో విధంగా పేర్కొందని పిటిషన్‌లో పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో వివక్ష, పక్షపాతం  లేకుండా  విచారణ సాగాలని  కోరారు. 

2019 మార్చి 15న హైదరాబాద్‌లోని వైఎస్ జగన్ నివాసంలో ఉదయం  5 గంటల సమయంలో మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైందని చెప్పారు. సమావేశం ప్రారంభమైన గంటన్నర తర్వాత అటెండర్ వచ్చి డోరు కొట్టారని తెలిపారు. ఓఎస్‌డీ కృష్ణమోహన్ వచ్చి జగన్‌కు ఏదో విషయం చెప్పారని.. వెంటనే జగన్ షాక్‌కు గురైనట్టుగా లేచి చిన్నాన్న(వైఎస్ వివేకానందరెడ్డి) చనిపోయారని చెప్పారని తెలిపారు. ఇంతకుమించి తాను సీబీఐకి చెప్పలేదని అన్నారు.

కానీ సీబీఐ చార్జ్‌షీటులో తాను చెప్పిన విషయాలను మార్చివేసిందని ఆరోపించారు. సీఎం జగన్ భార్య ప్రస్తావన కానీ.. మరే ఇతర ప్రస్తావన కాని తాను  చేయలేదని రిట్ పిటిషన్‌లో అజయ్ కల్లం పేర్కొన్నారు. సీబీఐ చార్జ్‌షీట్‌లో దర్యాప్తును తప్పుదోవ పట్టించే ధోరణి కనిపిస్తోందని అన్నారు. కొంతమందిని ఇరికించేందుకు సీబీఐ ఇలా చేస్తుందని ఆరోపించారు. ఇక, తన పిటిషన్‌లో ప్రతివాదులుగా కేంద్రం, సీబీఐలను పేర్కొన్నారు.