ఆంధ్ర ప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వాలంటీర్ల ద్వాారా సేకరిస్తున్న వైసిపి ప్రభుత్వం భారీ కుట్రకు తెరతీసిందంటూ టిడిపి నేత బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేసారు.
విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వాలంటీర్ల ద్వారా సేకరించడం వెనన వేల కోట్ల రూపాయల అవినీతి దాగివుందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కోట్లాది మంది రాష్ట్ర ప్రజల డాటాను విదేశాలకు అమ్ముకుని భారీగా డబ్బులు సంపాదించాలని సీఎం జగన్ కుట్రలు పన్నుతున్నారని అన్నారు. చివరకు పక్కరాష్ట్రం తెలంగాణలోని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఏపీ ప్రజల పూర్తి సమాచారం చేరిందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని ఉమ డిమాండ్ చేసారు.
వాలంటీర్ వ్యవస్థవల్ల కేవలం మహిళలకే కాదు ఎవ్వరికీ రక్షణ లేకుండా పోయిందని ఉమ అన్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగా జగన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానం వల్ల ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేదన్నారు. 5.5కోట్ల మందికి చెందిన డేటా దుర్వినియోగం ద్వారా వైసిపి బ్యాచ్ ఇప్పటికే రూ.50వేల కోట్ల పేదల భూములు కాజేసిందని ఆరోపించారు. చివరకు ప్రజల వేలిముద్రలు సేకరించడం ద్వారా బ్యాంక్ అకౌంట్స్ లోని డబ్బులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఉమ ఆందోళన వ్యక్తం చేసారు.
వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాల పేరిట వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారు... ఈ డేటాను దుర్వినియోగం చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఉమ అన్నారు. వైసిపి ప్రభుత్వ పాలనలో ఏపీ ప్రజల గోప్యతకు ఏమాత్రం రక్షణ లేకుండాపోయిందంటూ బోండా ఉమ ఆందోళన వ్యక్తం చేసారు.
Read More మహిళా కమిషన్ కార్యాలయం వద్ద జనసేన వీరమహిళల ఆందోళన.. తీవ్ర ఉద్రిక్తత..
ఇటీవల జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఏపీలో మహిళల మిస్సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వాలంటీర్లు ద్వారా ఒంటరి మహిళల వివరాలను సేకరిస్తున్న వైసిపి నాయకులు అరాచక శక్తులు చేతులకు అందిస్తున్నారని పవన్ ఆరోపించారు. ఇలా వాలంటీర్ వ్యవస్థపై పవన్ చేసిన ఆరోపణలను టిడిపి కూడా సమర్ధిస్తోంది. వాలంటీర్లు ప్రజల వ్యక్తిగత వివరాలను సేకరించడం ఎందుకుని టిడిపి నాయకులు కూడా వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
తాజాగా మహిళల మిస్సింగ్ పై కేంద్ర హోం శాఖ రాష్ట్రాల వారీగా ఓ నివేదికను విడుదల చేసింది. ఈ ఎన్సీఆర్బీ నివేదికలో తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో మహిళలు, బాలికలు కనిపించకుండా పోతున్నారని తెలిసింది. ఎన్సీఆర్బీ నివేదికలో 2019, 2020, 2021 సంవత్సరాల్లో మహిళలు, బాలికల మిస్సింగ్ వివరాలను వెల్లడించింది.దీని ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపించకుండా పోతున్న మహిళల సంఖ్య యేటికి యేడు పెరుగుతున్నట్టు స్పష్టమైంది.
18 ఏళ్ల లోపు వారిని బాలికలుగా, 18 ఏళ్లు పైబడినవారిని మహిళలుగా ఈ రిపోర్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో 2019లో 2186 మంది బాలికలు, 6252 మంది మహిళలు కనిపించకుండా పోయారని ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. 2020లో 2374 బాలికలు, 7057 మహిళలు, 2021లో 3358 మంది బాలికలు, 8969 మంది మహిళలు మిస్ అయినట్టు ఎన్సీఆర్బీ డేటా తెలిపింది. ఈ మూడు సంవత్సరాల వివరాలను పరిశీలిస్తే.. కనిపించకుండా పోయిన బాలికల సంఖ్య, మహిళల సంఖ్య ప్రతి యేటా పెరిగినట్టు తెలుస్తున్నది.