స్పీకర్ కోడెల శివప్రసాద రావు చుట్టూ అవినీతి ఆరోపణలు ముసురుకుంటున్నాయి. ఇంతకాలం కొడుకు పైన మాత్రమే వినిపిస్తున్న ఆరోపణలు తాజాగా కూతురుపైన కూడా మొదలయ్యాయి. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కూతురు నాసిరకం మందులను రాష్ట్రమంతటా బలవంతంగా అందరితోనూ కొనిపిస్తోందంటూ వైసీపీ ఎంఎల్ఏ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమైంది.

కొడుకు శివరామకృష్ణ మీదున్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఇటు సత్తెనపల్లి, అటు నరసరావుపేట నియోజకవర్గాల్లో ఎక్కడ దందాలు నడుస్తున్నదన్నా దాని వెనకాల శివరామకృష్ణ హస్తం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కొడుకు మీదున్న ఆరోపణలను స్పీకర్ అంగీకరించకపోయినా బాధితులు చాలామందే నేరుగా లోకేష్ ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. దాంతోనే కొడుకుపైనున్న ఆరోపణలన్నీ వాస్తవాలని తేలుతోంది. అవే ఆరోపణలు చంద్రబాబునాయుడు దృష్టిలో కూడా ఉన్నాయి. రైల్వే పనుల కాంట్రాక్టుకు సంబంధించి ఓ కాంట్రాక్టర్ ఏకంగా కేంద్ర రైల్వేశాఖ ఉన్నతాధికారుల వద్దే స్పీకర్ కొడుకుపై ఫిర్యాదు చేసారంటేనే శివరామకృష్ణ అవినీతి ఏ స్ధాయిలో జరుగుతోందో అర్ధమైపోతోంది.

అప్పుడప్పుడు కూతురు పైన కూడా ఏవో ఆరోపణలు వినబడుతూనే ఉన్నాయి. కొడుకు, కూరుతు మీద ఉన్న ఆరోపణలపై పార్టీలో కూడా విస్తృతంగా చర్చ జరుగుతోందన్నది వాస్తవం. అయితే, కోడెల బాగా సీనియర్ నేత కావటం అందులోనూ స్పీకర్ హోదాలో ఉండటంతో బయటపడి నేరుగా ఫిర్యాదు చేయటానికి ఎవరూ సాహసించటం లేదు. ఆ పరిస్ధితే సంతానానికి బాగా కలసివచ్చింది. ఈ నేపధ్యంలోనే వైసీపీ నరసరావు పేట ఎంఎల్ఏ గోపిరెడ్డి చేస్తున్న ఆరోపణలు కొత్తవి. ఎందుకంటే, ఇప్పటి వరకూ ఎవరూ ఇటువంటి ఆరోపణలు చేయలేదు.

ఓ మందుల తయారీ కంపెనీలో కోడెల కూతురు డైరెక్టర్ అట. సదరు కంపెనీ నాసిరకం మందులు తయారు చేసి జనాల మీదకు వదులుతున్నదట. ఆ మందులు నాసిరకమన్న కారణంతో అధికారులు తిరస్కరిస్తున్నా అందరిపైనా ఒత్తిడి పెట్టి మరీ కొనిపిస్తున్నదట కూతురు. అందుకు కోడెల సహకరిస్తున్నారని గోపిరెడ్డి ఆరోపిస్తున్నారు. మరి, ఈ ఆరోపణలు ఎంతదూరం వెళతాయో ఏమో చూడాలి.