మోడికి జై కొట్టిన వైసిపి నేత

మోడికి జై కొట్టిన వైసిపి నేత

ప్రధానమంత్రి నరేంద్రమోడికి వైసిపి నేత జై కొట్టారు. జిందాబాద్ అన్నారు. వైసిపి ఎన్డీఏకి మిత్రపక్షం కాదే? ఎందుకు జై కొట్టారు? ఆ విషయం తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. బుధవారం సాయంత్రం వైసిపి నేత జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేకహోదా ఇస్తే ప్రధానికి జై కొడతామని బల్లగుద్ది చెప్పారు. హోదా కోసం ఎవరితో అయినా కలుస్తామని, భాజపాకు మద్దతిస్తామని తమ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పటంలో తప్పేమీ లేదన్నారు.

రాష్ట్రాభివృద్ధి కోసం భాజపాకు మద్దతిస్తామని చెప్పటంలో తప్పేముందని జోగి ప్రశ్నించారు. తమకు రాష్ట్రాభివృద్ధి ముఖ్యమన్నారు. అందుకు ఎవరితో అయినా కలవటానికి సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. ప్రత్యేకహోదా కావాలన్న వాళ్ళు జగన్ కు మద్దతుగా నిలవాలన్నారు. అవసరం లేదన్న వాళ్ళు చంద్రబాబునాయుడు వైపు ఉండవచ్చన్నారు. ప్రత్యేకహోదా కావాలో వద్దతో తేల్చుకోవాల్సిన తరుణం వచ్చిందని జోగి అభిప్రాయపడ్డారు.

భాజపాకు మద్దతు విషయంలో జగన్ ప్రకటనను తప్పుపట్టిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను కూడా జోగి వదలలేదు. రామకృష్ణ మాటలు చూస్తుంటే సిపిఐ చంద్రబాబుతో కుమ్మకైపోయినట్లు అనుమానం వస్తోందన్నారు. ప్రత్యేకహోదా సాధన చంద్రబాబు వల్లే కాకపోతే జగన్ వల్ల ఏమవుతుందని రామకృష్ణ ప్రశ్నించటాన్ని జోగి తప్పుపట్టారు. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని చంద్రబాబు చెప్పిన తర్వాత తాము చేసిన ఆందోళనల్లో రామకృష్ణ ఎందుకు పాల్గొన్నారంటూ సూటిగా ప్రశ్నించారు. ముగిసిన అధ్యాయమని చంద్రబాబు చెబితే సరిపోతుందా అంటూ నిలదీశారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos