అమరావతి: పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హై కోర్టులో కౌంటర్ దాఖలు బాధ్యతను సీనియర్ అధికారికి అప్పగించిన వైసిపి ప్రభుత్వం. రాజధాని  విషయంతో 
దాఖలవుతున్న పిటిషన్లు, హై కోర్టు విచారణ అనేక ప్రభుత్వ శాఖలతో ముడిపడి ఉంటుంది. దీంతో కౌంటర్ దాఖలు సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఒకే అధికారికి ఈ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్యామలరావుకు అన్ని శాఖల తరపున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసే బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఒకవేళ శ్యామలరావు అందుబాటులో లేని సమయంలో వి.రామమోహనరావు  కౌంటర్ అఫిడవిట్ దాఖలు పనులు చూడనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

మూడు రాజధానులు ఎక్కడా లేవు: జగన్ కు రామ్ మాధవ్ ఝలక్

వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చిన సీఆర్‌డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణ చట్టాలను సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో వరుసగా పిటిషన్లు దాఖలవుతున్నాయి. తాజాగా టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాదులు జంధ్యాల రవిశంకర్‌, పవన్‌ కుమార్‌ అన్నాబత్తుని వాదించనున్నారు. అయితే ఈసారి రాష్ట్రంతోనే కాదు కేంద్ర ప్రభుత్వాన్ని ఢీ కొట్టడానికి ప్రతిపక్ష టిడిపి సిద్దమయ్యింది.

ఈ పిటీషన్‌లో ఏడుగురిని ప్రతివాదిగా చేర్చారు. ఇందులో కేంద్ర హోం శాఖ, కేంద్ర న్యాయ శాఖను కూడా ప్రతివాదిగా చేర్చారు. ఆంధ్రప్రదేశ్‌ డీసెంట్రలైజేషన్‌ అండ్‌ ఇన్‌క్లూజివ్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ ఆల్‌ రీజియన్స్‌ చట్టం 2020, ఏపీ విభజన చట్టం 2014  ప్రకారం ప్రభుత్వ చట్టాలు చెల్లదని పిటీషనర్‌ పేర్కొన్నారు. అలాగే సీఆర్డీఏ రద్దు చట్టం కూడా భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 200 కి విరుద్ధమని పిటీషన్‌లో పేర్కొన్నారు. 

 ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం ఇప్పటికే అనేక మలుపులు తిరుగుతుంది. గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో ఇక ఏర్పాటు లాంఛనమే అనుకుంటున్నా తరుణంలో... అమరావతి పరిరక్షణ సమితి కోర్టుకెక్కడంతో కొద్దీ రోజులపాటు స్తబ్దుగా ఉంది.ఇంతలోనే కేంద్రం హైకోర్టులో జగన్ సర్కార్ కి అనుకూలంగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని తుది నిర్ణయం రాష్ట్ర పరిధిలోకే వస్తుందని కేంద్ర హోంశాఖ హైకోర్టులో గురువారం నాడు దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. 

రాజధాని నిర్ణయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని కోర్టుకి తెలిపింది. చట్టసభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ.. కోర్టుల్లో న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ ఈ సందర్భంగా తేల్చిచెప్పింది.

హైకోర్టులోని రిట్‌ పిటిషన్‌ కు కౌంటర్ గా కేంద్ర హోంశాఖ ఈ అఫిడవిట్‌ ను దాఖలు చేసింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 6 ప్రకారమే 2014లో శివరామకృష్ణన్‌ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. రాజధాని ఎక్కడ పెట్టాలన్న దానిపై శివరామకృష్ణన్‌ కమిటీ పరిశీలన జరిపిందని, ఆగస్టు 30, 2014న ఈ కమిటీ రాజధాని విషయమై నివేదిక సమర్పించిందని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. 

2015లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయాలనీ నిర్ణయించిందని వారు కోర్టుకు తెలిపారు. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని, ఉండబోదని కోర్టుకి అపిడవిట్ లో పేర్కోన్నారు. 

 జులై 31,2020న ఏపీ ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణ కు సంబంధించి గెజిట్‌ను విడుదల చేసిందని, గెజిట్‌ ప్రకారంగా ఏపీలో మూడు పరిపాలనా కేంద్రాలుంటాయని పేర్కొన్నారు. గెజిట్‌ ప్రకారంగా శాసన రాజధానిగా అమరావతి, పరిపాలనా/కార్యనిర్వాహక  రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును పేర్కొన్నారని కేంద్రం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపింది. దీంతో రాజధాని విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో విభేదిస్తున్న టిడిపి ఇక కేంద్ర ప్రభుత్వంపైనా అదే స్టాండ్ తీసుకుంటోంది.