Asianet News TeluguAsianet News Telugu

నవ్యాంధ్ర కాదు కరోనాంధ్ర... యూఎస్, బ్రెజిల్ సరసన ఏపీ: కళా వెంకట్రావు

వైసీపీ ప్రభుత్వ వైఫల్యంతో రాష్ర్టం కరోనా కోరల్లో చిక్కి విలవిల్లాడుతోందని... రోజుకు 10 వేలకుపైగా కేసులు నమోదవుతున్నా ఈ ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టు కూడా లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. 

ycp govt failed control corona:  kala venkatrao
Author
Guntur, First Published Aug 11, 2020, 11:02 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

గుంటూరు: వైసీపీ ప్రభుత్వ వైఫల్యంతో రాష్ర్టం కరోనా కోరల్లో చిక్కి విలవిల్లాడుతోందని... రోజుకు 10 వేలకుపైగా కేసులు నమోదవుతున్నా ఈ ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టు కూడా లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. కరోనా పుట్టిన చైనాలోని వుహాన్ నగరంలో కేసులు తగ్గినా ఆంధ్రప్రదేశ్ లో తగ్గకపోవటం సిగ్గుచేటన్నారు. పొరుగు రాష్ట్రాల్లో కేసులు తగ్గుతుంటే ఏపీలో మాత్రం రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి... ఇది నూటికి నూరుశాతం ప్రభుత్వ వైపల్యమేనని ఆరోపించారు. 

''చంద్రబాబు నాయుడు హయాంలో నవ్యాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా వెలుగులు విరజిమ్మితే, నేడు జగన్ హయాంలో కరోనాంధ్రప్రదేశ్ గా మారింది. మీ స్వార్ధం కోసం ప్రజలని కరోనా బారిన పడేస్తారా?  మద్యం షాపులు తెరిచి కరోనాకి రహదారులు పరిచింది మీరుకాదా? ఈ సమయంలో మద్యం విక్రయాలు సరికాదని డబ్యూహెచ్‌వో చెప్పినా వినకుండా అదనంగా గంట సమయం పొడిగించి మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతున్నారు. నాడు అభివృద్దిలో దూసుకెళ్లిన ఏపీ నేడు కరోనా ఎక్స్ ప్రెస్ గా మారి కరోనా కేసుల్లో దూసుకెళ్తోంది'' అని అన్నారు. 

''దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ర్టంగా ఆంధ్రప్రధేశ్ నిలిచింది. యాక్టివ్ కేసులలో 87,112 కేసులతో దేశంలోనే 2వ స్ధానంలో ఉంది.  గత 10 రోజులలో ప్రతి రోజు కేసుల శాతం 6.16 శాతంతో, ప్రతిరోజు మరణాల పెరుగుదల శాతం 5.09 శాతంతో దేశంలోనే రాష్ట్రం అగ్రస్ధానంలో నిలిచింది.  ప్రపంచంలో కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న ప్రాంతాల జాబితాలో నేడు యుఎస్ఎ, బ్రెజిల్, కొలంబియా దేశాల సరసన ఆంధ్రప్రదేశ్ చేరటం ఆందోళనకరం. జాతీయ స్ధాయి కన్నా ఏపీలో 10 శాతం తక్కువగా రికవరి రేటు ఉంది'' అని వెల్లడించారు. 

read more   ఆ సర్వేలో జగన్ కు మూడో స్థానమా...నెంబర్ వన్ కు ఆర్హుడయితే: అయ్యన్న సంచలనం (వీడియో)

'' దేశంలో కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న 30 జిల్లాల జాబితాలో 9 జిల్లాలు మన రాష్ర్టం నుంచే ఉండటం ప్రభుత్వ వైపల్యానికి నిదర్శనం. దేశంలో 8,500 కేసుల కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్న జిల్లాల జాబితాను పరిశీలిస్తే.. కేవలం మన రాష్ర్టంలో మాత్రమే నూటికినూరు శాతం అన్ని జిల్లాలు ఆ జాబితాలో ఉన్నాయి'' అని పేర్కొన్నారు. 

''కోవిడ్ ఆస్పత్రుల్లో రోగులకు సరైన వైద్యం, ఆహారం అందటం లేదు, ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోవటం లేదు, మరో వైపు క్యారంటైన్లలో సరైన సౌకర్యాలు  లేవు. కరోనా కట్టడిలో, ఆస్పత్రుల్లో సదుపాయాల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సొంత పార్టీ నేతలే ఏకరువు పెడుతున్నారు. అనంతపురం జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆస్పత్రుల్లో ఏర్పాట్లు ఇలాగేనా చేసేదంటూ సాక్షాత్తూ వైద్యశాఖమంత్రి ఆళ్ల నాని ఎదుటే అసంతృప్తిని వెళ్లగక్కారు'' అని గుర్తుచేశారు. 

''ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగుల నుంచి వేల రూపాయలు దోపిడీ చేస్తున్నా పట్టించుకోవటం లేదు. ఫోన్ చేసిన పావుగంటలో అంబులెన్స్ వస్తుందని ప్రభుత్వం ప్రకటనలు గుప్పించింది. పావు గంట కాదు కదా రోజుల తరబడి ఎదురుచూసినా అంబులెన్స్ జాడ ఉండట్లేదు. వైద్యం అందక రోగుల అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో పరిస్ధితి ఈ విధంగా ఉంటే జగన్ కి మాత్రం ప్రజల ప్రాణాలు గాలికొదిలి  మూడు రాజధానులు, మూర్ఖపు రాజకీయాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు'' అని మండిపడ్డారు. 

''రాష్ర్టంలో కోవిడ్ ఆస్పత్రులు, క్వారంటైన్ల సెంటర్లలో ఏం జరుగుతుందో చూస్తున్నారా?  క్వారంటైన్ లో రోగులు ధర్నాలు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దమవుతోంది. ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ  కోవిడ్ 19 ఆస్పత్రులను, క్వారంటైన్ కేంద్రానులను కనీసం ఒక్క రోజైనా సందర్శించారా? ముఖ్యమంత్రి జగన్ తన అసమర్ధత, అనుభవరాహిత్యం, అహంకారత్వంతోనే రాష్ర్టంలో ఈ పరిస్ధితి నెలకొంది. జగన్ ఇప్పటికైనా మూడు రాజధానులు, మూర్ఖపు రాజకీయాలు పక్కనపెట్టి  కరోనా నివారణకు చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలి'' అని కళా వెంకట్రావు సూచించారు. 
 
 

Follow Us:
Download App:
  • android
  • ios