తాడేపల్లి గ్రామంలోని ఓల్డ్ టోల్ గేట్ ఎదురుగా పార్టీ కేంద్ర కార్యాలయానికి జగన్ స్ధలాన్ని ఎంపికచేసారు. మరో వారంలో శంకుస్ధాపన కూడా చేయనున్నారు.

కార్యాలయం నిర్మాణ విషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టిడిపి నేతలకు త్వరలోనే గట్టి సమాధానం చెప్పనున్నారు. రాజధాని ప్రాంతంలో కీలకమైన తాడేపల్లి గ్రామంలోని ఓల్డ్ టోల్ గేట్ ఎదురుగా పార్టీ కేంద్ర కార్యాలయానికి జగన్ స్ధలాన్ని ఎంపికచేసారు. మరో వారంలో శంకుస్ధాపన కూడా చేయనున్నారు. పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం ఓ రైతు నుండి జగన్ రూ. 15 కోట్లతో 2 ఎకరాలు కొనుగోలు చేసారు. కార్యాలయానికి సంబంధించిన డిజైన్ను కూడా హైదరాబాద్ లోని ఓ ఆర్కిటెక్చర్ సిద్ధం చేసారు. శంకుస్ధాపన కాగానే నిర్మాణ పనులు ప్రారంభమవనున్నాయి.

రాష్ట్రం విడిపోయి రెండున్నరేళ్ళయినా వైసీపీ ఇంకా హైదరాబాద్ నుండే రాజకీయాలు చేస్తోందంటూ తరచూ టిడిపి నేతలు జగన్ను విమర్శిస్తున్నారు. జగన్ కూడా ఎందుకు ఇంకా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుండే పార్టీ కార్యక్రమాలు, ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారని అందరూ అనుకుంటున్నదే. ఎంత ఉమ్మడి రాజధానైనా హైదారాబాద్ ఏపికి పొరుగు రాష్ట్రమే. పొరుగు రాష్ట్రంలో కూర్చుని రాజకీయాలు చేస్తుండటంతో టిడపి జగన్ను పరాయి రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా ముద్ర వేస్తోంది.

సదరు ముద్ర చెరిపేసుకునే విషయంలో వైసీపీ నేతలతో జగన్ చర్చలు జరిపారు. అందులో భాగంగానే వైసీపీ కోర్ కమిటిలో కీలకమైన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు(బంగారు) చొరవ తీసుకుని రైతుతో జగన్ను మాట్లాడించారు. దాంతో కార్యాలయానికి స్ధలం నిర్ణయమైంది. వీలైనంత తొందరగా పార్టీ కార్యాలయాన్ని నిర్మించటం ద్వారా ప్రత్యర్ధులకు గట్టి సమాధానం చెప్పాలని జగన్ నిర్ణయించారు. సరే, కేంద్ర కార్యాలయమన్నాక జగన్ తో పాటు కీలక నేతలకు విడివిడిగా ఛాంబర్లు, 500 మంది కూర్చోవటానికి సరిపడా 2 సమావేశ మందిరాలు, వాహనాల పార్కింగ్, విశ్రాంతి గదులు, పెద్ద క్యాంటిన్, డైనింగ్, మీడియా సెల్ తదితరాలన్నీ సహజంగానే ఉంటాయి కదా. బహుశా ఈ ఏడాది చివరిలోగా నిర్మాణం పూర్తి చేయాలని జగన్ అనుకుంటున్నట్లు సమాచారం.