గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం ఉంగుటూరులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీ మూకలు దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి రోజునే ఆ దుర్ఘటన చోటుచేసుకోవడం దారుణమని అన్నారు. 

''ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న టీడీపీ కార్యకర్తలపై దాడి చేయడం దుర్మార్గం. మహిళలు, చిన్నారులపై దాడిచేసిన వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు వదిలేసి, దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం వైసిపి ఆటవిక రాజ్యానికి నిదర్శనం''అని  మండిపడ్డారు. 

read more  నిమ్మగడ్డ వర్సెస్ జగన్ ప్రభుత్వం... నేడే తుది తీర్పు వెలువరించనున్న హైకోర్టు

''స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపి అభ్యర్డులపై దాడి చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుండా బాధితులపైనే ఎదురు కేసులు బనాయించడం హేయం. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి'' అని డిమాండ్ చేశారు. 

''ఉంగుటూరు గ్రామంలోని టిడిపి కార్యకర్తలకు భద్రత కల్పించాలి. బాధితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలి. పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి. 
రాష్ట్రంలో రోజురోజుకూ మితిమీరుతున్న వైసీపీ రౌడీ మూకల ఆగడాలు, అరాచకాలకు కళ్లెం వేయాలి.  సీఎం జగన్, డీజీపీ తక్షణమే జోక్యం చేసుకుని వైసిపి రౌడీమూకలను కట్టడి చేయాలి''  అని చంద్రబాబు కోరారు.