అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక ఎన్నికల కోసం చెలరేగిన వివాదం ఏకంగా ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవికే గండం తెచ్చింది. ఈ ఎన్నికల  విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నాడని అతడిని  జగన్ ప్రభుత్వం తొలగించింది. అయితే ఎస్ఈసీ ని తొలగించడానికి నిబంధనలనే మార్చి ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించగా... ఇంతకాలం విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ(శుక్రవారం) తుదితీర్పు వెలువరించనుంది. దీంతో ప్రభుత్వం, పిటిషన్ మాత్రమే కాదు యావత్‌ రాష్ట్రం ఈ తీర్పు కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 

పంచాయితీ రాజ్ చట్టానికి సవరణ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పదవీ కాలాన్ని కుదించింది వైసిపి ప్రభుత్వం. ఇందులోభాగంగా పంచాయతీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ 617, 618, 619 జీవోలను జారీ చేసింది. ఈ నిబంధనలను అనుసరించి అప్పటి ఎస్ఈసీ రమేష్ కుమార్ ను పదవి నుండి తొలగించి నూతన ఎస్ఈసీని నియమించింది ప్రభుత్వం. 

read  more  వదిలేది లేదు...చంద్రబాబు, లోకేశ్ లకు టెస్టులు: మంత్రి అనిల్ కుమార్ వెల్లడి

అయితే తనను తొలగించాలన్న దురుద్దేశంతోనే ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చారని... దీన్ని వెంటనే  రద్దు చేయాలని కోరుతూ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం నిర్ణయం చట్టవిరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ రమేశ్‌కుమార్‌తో పాటు మొత్తం 13 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 

ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ నెల 8వ తేదీన తీర్పును రిజర్వు చేసింది. ఆ తీర్పును శుక్రవారం వెలువరించనుంది.