అమరావతి: కాకినాడ సెజ్ కొనుగోళ్ల బినామీ లావాదేవీలపై సీఎం జగన్మోహన్ రెడ్డి మౌనం వీడాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. సీఎం జగన్ కు ఎలాంటి సంబంధం లేకుంటే రైతులకు పరిహారం ఎందుకు ఇప్పించడం లేదు..? అని నిలదీశారు. 

''రూ.2,610కోట్ల లావాదేవీల్లో రైతుల వాటాగా రూ.1,000కోట్లు ఇప్పించడంలో అభ్యంతరం ఏమిటి..? ఎకరానికి రూ 10లక్షల చొప్పున 10వేల ఎకరాలకు అదనపు పరిహారం కింద రూ.1,000కోట్లు ఇప్పించాలి'' అని కోరారు.

''బల్క్ డ్రగ్ పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు చేయడంపై స్థానికుల్లో వ్యతిరేకత ఉంది. కాలుష్య సమస్యతో పాటు మత్స్యకారులు అనేకమంది జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.  జీవనోపాధి కోల్పోయే మత్స్యకారులకు ప్రత్యేక ఆర్ధిక సాయం అందించాలి. ఇక్కడ నెలకొల్పే పోర్టుకు అటు ఇటు మత్స్యకారుల వేటకు వీలుగా బ్యాడ్జెట్స్, జెట్టీలు ఏర్పాటు చేయాలి'' అని సూచించారు. 

read more  మరికొందరు వైసీపీలోకి: బాంబు పేల్చిన మంత్రి బొత్స సత్యనారాయణ

''ఇక్కడి హేచరీస్ పై ఆధారపడిన అనేకమంది సామాన్య మధ్యతరగతి కుటుంబాల ఉపాధికి కూడా బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటుతో గండిపడనుంది. హేచరీస్ పై ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలకు కూడా న్యాయం చేయాలి'' అన్నారు. 

''అరబిందో ఇన్ ఫ్రా ఆదాయంలో స్థానికులకు వాటా ఇవ్వాలి. బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ ఏర్పాటు ప్రయత్నాలను విరమించుకోవాలి. జగన్ రెడ్డి మౌనంగా ఉండటమే ఈ బినామీ లావాదేవీలకు తార్కాణం. కేంద్రం తక్షణమే స్పందించి ఈ బినామీ లావాదేవీలపై కొత్త బినామీ చట్టం ప్రకారం దర్యాప్తు జరపాలని కోరుతున్నాం. వీటన్నింటిపై త్వరలోనే కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నాం'' అని యనమల హెచ్చరించారు.