విశాఖపట్టణం: త్వరలోనే మరికొంతమంది తమ పార్టీలో చేరుతారని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుండబద్దలు కొట్టారు. అయితే ఎవరెవరు తమ పార్టీలో చేరుతారనే విషయాన్ని మాత్రం ఆయన ప్రకటించలేదు.

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడి వైసీపీలో చేరుతారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది.ఈ తరుణంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.

ఆదివారం నాడు ఆయన విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ పనితీరుపై అభిమానం ఉన్నవారెవరైనా పార్టీలోకి వస్తారని ఆయన చెప్పారు.విశాఖపట్టణంలోని మర్రిపాలెం ఫ్లైఓవర్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ వచ్చే నెలలో ప్రారంభిస్తారని మంత్రి  చెప్పారు.

విశాఖలో మెట్రో కార్యాలయాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. సమాజంలో గౌరవంగా ఉండేవాళ్లంతా నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన హితవు పలికారు.
ఎన్నికల్లో ఓటమిపాలైనవారంతా ఎన్నిమాటలైనా చెబుతారని ఆయన అభిప్రాయపడ్డారు. 

విశాఖపట్టణంలో టీడీపీ నేతలపై వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించింది. మూడు రాజధానులకు అనుకూలంగా విశాఖలోని టీడీపీ నేతలను తమ పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా రాజకీయంగా ఆ పార్టీని దెబ్బకొట్టవచ్చనే ఉద్దేశ్యంతో వైసీపీ పావులు కదుపుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.