నీళ్లతో  వైఎస్ కంచుకోటను  వశపర్చుకోవాలనుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

 జాగ్రత్తగా గమనించండి, కడప జిల్లా గండికోట ప్రాజక్టునుంచి విడుదలయిన నీళ్లలో పారుతున్నవి పాలిటిక్స్.

ఈ రోజు ఈ ప్రాజక్టును ప్రారంభించి పులివెందులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీళ్లు విడుదల చేశారు.

పులివెందుల తరతరాలుగా కాంగ్రెస్ నియోజకవర్గం. రాజశేఖర్ రెడ్డి కుటుంబ సంస్ధానం. అక్కడ టిడిపి పోటీ పెట్టడం , ఓడిపోవడం ఎపుడూ జరిగేవే. వైఎస్ కుటుంబానికి ప్రత్యర్థులు కూడా ఉన్నారుకాబట్టి వారి నుంచి ఒకరిని ఎంపిక చేసి వైఎస్ కు, తర్వాత ఆయన వారసులకు పోటీ పెట్టడం మొక్కుబడిగా జరిగేది. అంతే తప్ప ఎపుడూ ఈ నియోజకవర్గాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించే సాహసం చేయలేదు. అయితే వైఎస్ మరణం తర్వాత , జగన్ పిల్లగాడు, కాబట్టి తన తెలివి తేటలతో, అనుభవంలో ఆయన పులివెందలను వశపర్చుకునే ప్రయత్నం మొదలుపెట్టారు.

దీనికోసం ఆయన వైఎస్ నే వాడుకుంటూ ఉండటం విశేషం. ఈ రోజు ప్రారంభమయిన గండికోట ప్రాజక్టు కడపజిల్లాకు నీళ్లివ్వడమే కాదు, అపుడు అనుకున్న బ్రాహ్మణి స్టీల్ కూడా నీటిని అందించేందుకు ప్లా న్ చేశారు. కర్నూల్ జిల్లా అవుకు నుంచి సొరంగం తవ్వి గండికోటకు కృష్ణా జలాలు సరఫరా ప్రారంభించారు. ఒక దఫా విడుదల కూడాచేశారు. ఇపుడు జరిగిందిరెండో విడుదల. అది వేరే కథ. నిత్యకల్యాణం,పచ్చతోరణం... పండగలా జరిపితే తప్ప ప్రజల మనసుల్లో తన బొమ్మ నాటుకోదనే అనుమానం ఆయనది.

అయితే,నీళ్లు కాదు, రాజకీయాలే ముఖ్యం. నీళ్లకురాజకీయాలుంటాయి. ప్రాజక్టు ప్రారంభించాక ముఖ్యమంత్రి చేసింది రాజకీయ ప్రసంగం. కవ్వించే ప్రసంగం. “వాళ్లకు(వైస్ వర్గానికి) కత్తులు కావాల. నాకు అభివృద్ధి కావాల. ఈ ప్రాజక్టుతో పులివెందులకు నీళ్లొస్తాయి. రైతులకు లక్షలొస్తాయి. అపుడు ఇక్కడ ఫ్యాక్షన్ ఉండదు. వాళ్లు పట్టు తప్పుతారు. అందుకే వారి లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతూ ఉంది. వారు గండికోట కలగానే మిగిలిపోతుందునుకున్నారు. కాని నేను నిజం చేశారు. నిజమయ్యే సరికి వారు ఫ్రస్ట్రేషన్ కు లోనవుతున్నారు. వాళ్లకిఅనుభవం లేదు. మొదటిసారి ఎన్నికయిన వారు. నేను అనుభవజ్ఞుడిని....” ఇలా సాగింది ముఖ్యమంత్రి ప్రసంగం.

ఈ ప్రసంగంలో ఆయన పదే పదే గుర్తుచేసింది... తన నియోజకవర్గం కుప్పం కంటే కూడా ముందుగా ప్రత్యర్థి నియోజకవర్గానికి నీళ్లిచ్చాను అని. అంటే తనకు రాజకీయాలు లేవని, తాను రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నానని, తనను ఆదరించాలని ఆయన పులివెందల ప్రజలను కోరుతున్నారు.

ఇక పులివెందులలో గొడవలు, తన్నుకోవడాాలు ఉండవని,నీళ్లిచ్చి తాను ఈ మేలు చేశానని ఆయన అన్నారు.

ఈ నీళ్లతో పులివెందులలో ప్రతిరైతు ఇంటికి తెలుగుదేశం రాజకీయాలు ప్రవహిస్తాయని, ఇళ్లలో ఉన్నవారు తనను గుర్తుంచుకుని ఓటేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆశ, అత్యాశ.

పులివెందుల చరిత్ర సృష్టించిందని ఆయన అన్నారు. మరి పులివెందుల టిడిపి వశమవుతుందా లేక ఇదొక రాజకీయ డ్రామా, చాలా చూశాం లే అని పులివెందుల ప్రజలు తమ పని తాము చేసుకుపోతారా?