ఇరవైనాలుగు గంటల్లోనే చంద్రబాబునాయుడు స్వరంలో మార్పు వచ్చేస్తోంది. మొన్నటి వరకూ టిడిపి నేతలే బిజెపిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవారు. వారిని వారిస్తున్నట్లుగా చంద్రబాబు కర్రపెత్తనం చేసేవారు. అటువంటిది ఎప్పుడైతే కేంద్రప్రభుత్వంలో నుండి టిడిపి ఎంపిలు తప్పుకున్నారో మెల్లిగా చంద్రబాబు కూడా మిగిలిన నేతల్లాగే మాట్లాడ్డం మొదలుపెట్టారు.

ఇంతకీ చంద్రబాబు శుక్రవారం ఏమన్నారంటే, భారతీయ జనతా పార్టీతో పొత్తువల్ల టిడిపి అదనంగా ఒరిగిందేమీ లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎంపీలతో చంద్రబాబు మాట్లాడుతూ సాధారణ ఎన్నికల కంటే ముందే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన విషయాన్ని గుర్తుచేశారు. పొత్తులేకుండా ఎన్ని ఓట్లు వచ్చాయో పొత్తు తర్వాత కూడా అవే ఓట్లు వచ్చాయని ఎంపీలతో అన్నారు.

అయితే, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బిజెపితో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. బిజెపితో కలవటం వల్ల రాష్ట్రానికి వచ్చింది కూడా ఏమీ లేనపుడు కేంద్రంలో భాగస్వామిగా ఉండాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే త్వరలో ఎన్డీఏకి కూడా టాటా చెప్పేట్లే ఉన్నారు.