రాష్ట్ర ప్రజలు ఇంకా భారతీయ జనతా పార్టీని నమ్ముతారా ? పోయిన ఎన్నికల్లో బిజెపి, టిడిపిలు ఇచ్చిన హామీలేంటి? గద్దెనెక్కిన తర్వాత చేసిందేమిటి?  అన్న విషయాలను ప్రజలు గనుక బేరీజు వేసుకుంటే వచ్చే ఎన్నికల్లో బిజెపికి వచ్చేది గుండుసున్నా అనటంలో సందేహం అవసరం లేదు. అదేవిధంగా బిజెపితో కలిసే చంద్రబాబునాయుడు ఎన్నికలను ఎదుర్కొన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చారు. కాబట్టి కేంద్రప్రభుత్వం చేసిన మోసంలో చంద్రబాబుకు కూడా భాగస్వామ్యం ఉంది.

విభజన చట్టం అమలు, ఎన్నికల హామీల అమలులో మిత్రపక్షాలు ఘోరంగా విఫలమయ్యాయి. చంద్రబాబు సంగతి పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో బిజెపికి మాత్రం జనాలు చుక్కలు చూపించటం ఖాయంగా తెలుస్తోంది. ఎందుకంటే, ప్రత్యేకహోదాను తుంగలోతొక్కారు. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ అంశాన్ని పక్కన పడేశారు. రెవిన్యూ లోటు కూడా భర్తీ చేయలేదు. ఇలా ఏ విషయంలో చూసుకున్నా రాష్ట్రప్రయోజనాలను బిజెపి కాలరాసింది.

తాజ బడ్జెట్లో కూడా ఏపికి కేంద్రం మొండిచెయ్యే చూపింది. వచ్చే ఎన్నికల్లోగా ఇదే చివరి బడ్జెట్ కాబట్టి టిడిపి అంత రచ్చ చేస్తోంది. అందుకే మూడున్నరేళ్ళ కాలంలో కానీ లేదా తాజా బడ్జెట్లో కానీ ఏపికి ఏమి చేశామో చెప్పాలంటూ బిజెపి జాతీయ నాయకత్వం ఏపి నేతలను ఆదేశించింది.

అందుకనే మంత్రి మాణిక్యాలరావు, ఎంఎల్సీ సోము వీర్రాజు తదితరులు రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్నారు. తమ పర్యటనల్లో ఏపికి కేంద్రం చేసిన సాయాన్ని వివరిస్తారట. నిజంగానే కేంద్రం ఏపికి అంత సాయమే చేసుంటే ఇపుడు కొత్తగా రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏంటి? పైగా బడ్జెట్లో చెప్పిన పేదలకు ఆరోగ్య బీమా, వ్యవసాయ రుణాల పెంపు లాంటివి దేశమంతటా వర్తిస్తుంది.  అంతేకాని ఏపికంటూ ప్రత్యేకంగా చేసిందేమీలేదు

.  

ముందే చెప్పుకున్నట్లు పోయిన ఎన్నికల్లో మోడి, వెంకయ్యనాయుడు ఏపికి ఇచ్చిన హామీలేవి అమలు కాలేదన్ని విషయాన్ని బిజెపి నేతలు ఉద్దేశ్యపూర్వకంగా పక్కనబెడుతున్నారు. రేపటి ఎన్నికల్లో అవే కీలకపాత్ర పోషిస్తాయి. సరే, ఎన్నికల్లో బిజెపికి దెబ్బ పడితే టిడిపికీ దెబ్బ ఖాయమే. బిజెపి-టిడిపిలు కలిసున్నా, విడిపోయినా దెబ్బైతే ఖాయం. మరి ఆ సమస్య నుండి రెండు పార్టీలు ఏ విధంగా బయటపడతాయో చూడాలి.