‘మొత్తం 25 మంది ఎంపిలతోనూ రాజీనామాలు చేయిద్దాం’ అంటూ జగన్ పదే పదే చెప్పటంపై రాష్ట్ర రాజకీయాల్లో విస్తృతంగా చర్చ మొదలైంది. ఎందుకంటే, ప్రత్యేకహోదా డిమాండ్ తో వైసిపికి చెందిన 5 మంది ఎంపిలు రాజీనామాలు చేసినా ఒరిగేదేమీ ఉండదు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుండి టిడిపి మంత్రులు బయటకు వచ్చేసినంత మాత్రనా ఉపయోగమూ ఉండదు. మరెందుకు జగన్ ఎంపిల రాజీనామాలపై అంతగా పట్టుబడుతున్నారు?

ఎందుకంటే, ఎవరు రాజీనామాలు చేసినా చేయకపోయినా మోడి సర్కార్ కు వచ్చే నష్టమేమీలేదు. ఎందుకంటే, మోడికి స్వతంత్రంగానే కావాల్సినంత బలముంది. కాబట్టే అవిశ్వాస తీర్మానమన్నా, రాజీనామాలన్నా లెక్క చేయటం లేదు. అదే మొత్తం 25 మంది ఎంపిలు గనుక రాజీనామాలు చేస్తే కేంద్రంలో తప్పక కదలిక వస్తుంది.

ఎలాగంటే, రాజీనామాలను గనుక టిడిపి, వైసిపిలు ఆమోదింపచేసుకుంటే కచ్చితంగా ఉపఎన్నికలు నిర్వహించాల్సిందే. అయితే, బిజెపికి చెందిన ఇద్దరు ఎంపిలు రాజీనామాలు చేయకపోయినా పర్వాలేదు. మిగిలిన 23 స్ధానాల్లో ఉపఎన్నికలు తప్పవు. ఉపఎన్నికల్లో ఎటూ టిడిపి, వైసిపిలు పోటీ పడతాయి. అప్పుడు బిజెపి ఏం చేస్తుంది?

2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఉబలాటపడుతున్న బిజెపికి తన బలమెంతో తెలుసుకోవాలంటే ఇదే చక్కటి అవకాశం. కాబట్టి బిజెపి కూడా పోటీ చేస్తుంది. టిడిపి, వైసిపిల్లో ఏ పార్టీకెన్ని సీట్లు వచ్చిన ఒకటే. బిజెపికి మాత్రం ఏ సీటులోనూ గెలవలేదనుకోండి అప్పుడు ఏపిలో బిజెపి భవిష్యత్తేంటో జాతీయ నాయకత్వానికి తెలిసి వస్తుంది.

ప్రత్యకహోదా, ఏపి ప్రయోజనాలు, విభజన హామీల అమలు లాంటి ప్రాధాన్యతలు అప్పుడు మోడికి గుర్తుకువస్తాయి. లేకపోతే భవిష్యత్తులో బిజెపికి పుట్టగతులుండవన్న విషయం రాష్ట్రంలోని నేతలకు కూడా తెలిసివస్తుంది. ఆ విషయం ఇటు మోడికి అటుక అమిత్ షాకు తెలియాలనే జగన్ పదే పదే ఎంపిల రాజీనామాలపై ఒత్తిడి తెస్తున్నారు.