వైసీపీ అధ్యక్షునిగా జగన్ హయాంలో టిడిపి, కాంగ్రెస్ నుండి వచ్చిన ఎంఎల్ఏ, మంత్రులు, ఎంపిలు పార్టీలో చేరారు. తమ పదవులకు వారు రాజీనామాలు చేసిన తర్వాత కానీ ఎవరినీ పార్టీలోకి చేర్చుకోలేదు కదా? మరి ఆ విషయాన్ని ఎందుకు చంద్రబాబు, జెసి, ఇతర నేతలు మాట్లాడటం లేదు.
తెలుగుదేశంపార్టీ 24 గంటలూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జపం చేస్తోంది. చంద్రబాబునాయుడు దగ్గర నుండి ప్రతీ నేతదీ ఒకే పద్దతి. విషయం ఏదైనా సరే జగన్ ప్రస్తావన తేకుండా వారికి పొద్దు గడవటం లేదు. మంత్రివర్గ సమావేశంలో జగన్ గురించి చంద్రబాబు ప్రస్తావిస్తారు. ఢిల్లీలో ఎంపి జెసి దివాకర్ రెడ్డి జగన్ పై విరుచుకుపడతారు. చివరకు టివి చర్చల్లో టిడిపి నేతలు జగన్ పై దుమ్మెత్తిపోయనిదే చర్చను ముగించరు. చర్చా అంశానికి ఏమాత్రం సంబంధం లేకపోయినా సరే పనిగట్టుకుని మరీ జగన్ పై విరుచుకుపడుతున్నారు. చివరకు జగన్ వ్యవహారం టిడిపికి ఓ ఆవు వ్యాసంలాగ అయిపోయింది.
ఫిరాయింపులపై ఫిర్యాదు చేయటానికి జగన్ రాష్ట్రపతిని కలిసారు. రాష్ట్రపతిని కలవటమన్నది జగన్ ఇష్టం. ప్రతిపక్ష నేతగా జగన్ కున్న హక్కు. మరి దానికే చంద్రబాబు దగ్గర నుండి జెసి వరకూ ప్రతీ ఒక్కళ్ళూ జగన్ను ఎందుకు తప్పు పడుతున్నారో అర్ధం కావటం లేదు. పైగా ఫిరాయింపులను నేతలు ఓ వైపు తప్పు పడుతూనే ఇంకో వైపు చంద్రబాబును సమర్ధిస్తుండటం విచిత్రమైన స్ధితి. ఎప్పుడో పివి నరసింహారావు చేయలేదా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫిరాయింపలను ప్రోత్సహించలేదా? అంటూ చంద్రబాబు, జెసి తదితరులు సమర్ధించుకోవటంలో అర్ధం లేదు.
అప్పట్లో పివి అయినా వైఎస్ అయినా చేసింది తప్పనే కదా అందరూ అన్నది. పైగా పివి హయాంలో అప్పటి టిడిపి ఎంపిలు మందా జగన్నాధం, ఆదికేశవుల నాయడు బాహాటంగా చంద్రబాబుపై తిరుగుబాటు చేసారు. ఇక, వైఎస్ హయాంలో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి, బాల నాగిరెడ్డి తమ పదవులకు రాజీనామాలు చేసారు. కాకపోతే స్పీకర్ అమోదించలేదు. సరే, ఏమైనా వారు చేసింది తప్పే అని అనుకుందాం.
మరి వైసీపీ అధ్యక్షునిగా జగన్ హయాంలో టిడిపి, కాంగ్రెస్ నుండి వచ్చిన ఎంఎల్ఏ, మంత్రులు, ఎంపిలు పార్టీలో చేరారు. తమ పదవులకు వారు రాజీనామాలు చేసిన తర్వాత కానీ ఎవరినీ పార్టీలోకి చేర్చుకోలేదు కదా? మరి ఆ విషయాన్ని ఎందుకు చంద్రబాబు, జెసి, ఇతర నేతలు మాట్లాడటం లేదు. అంటే వారు చేస్తున్నది తప్పన్న విషయం వారికి బాగా తెలుసు. కాబట్టే వారి చర్యలను సమర్ధించేందుకు కావాల్సిన విషయాలను మాత్రమే వారు మాట్లాడుతున్నారు. ఎవరికైనా అనుమానమా?
