‘రెండెకరాల రైతును అంటున్న చంద్రబాబుకు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి’..ఇవి బిజెపి ఎంఎల్సీ సోము వీర్రాజు తాజాగా సంధించిన ప్రశ్న. పై ప్రశ్నతో చంద్రబాబునాయుడుకు భారతీయ జనతా పార్టీ పెద్ద షాక్ ఇచ్చింది. ఇంతకాలం వ్యక్తిగతంగా పెద్దగా మాట్లాడని భాజపా నేతలు ఒక్కసారిగా చంద్రబాబును లక్ష్యంగా చేసుకోవటం సిఎంకు ఊహించని పరిణామమే. ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందని, రాష్ట్రప్రయోజనాల విషయంలో చంద్రబాబు మెతక వైఖరితో వ్యవహరిస్తున్నారని అంటున్న బిజెపి నేతలు ఒక్కసారిగా గేరు మార్చారు. ఏకంగా చంద్రబాబే అవినీతిపరుడని మీడియా ముందు ఆరోపించటంతో టిడిపి నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

కర్నూలులో మీడియాతో మాట్లాడిన బిజెపి ఎంఎల్సీ సోము వీర్రాజు చంద్రబాబు అవినీతికి వారసుడంటూ విరుచుకుపడ్డారు. అంతేకాకుండా వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాలంటూ నిలదీశారు. మహానేతను భూస్ధాపితం చేసి రాజ్యమేలుతున్నారంటూ ధ్వజమెత్తారు. వీర్రాజు చంద్రబాబును పూర్తిగా వ్యక్తగతంగానే లక్ష్యం చేసుకోవటంతో టిడిపిలో కలకలం మొదలైంది. ‘రాష్ట్రంలో జరుగుతున్నది రూలింగ్ కాదని కేవలం ట్రేడింగ్ మాత్రమే’ అంటూ ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. పైగా తమ పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకే తాము అవినీతిపై ప్రశ్నిస్తున్నట్లు వీర్రాజు చెప్పటం చంద్రబాబును మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. కేంద్రం ఇస్తున్న నిధులు రాష్ట్రంలోని కొందరికి ఆదాయవనరుగా మారిందనటం గమనార్హం. మొత్తానికి పొత్తులకు సంబంధించి చంద్రబాబు విషయంలో భాజపా జాతీయ నాయకత్వం కీలకమైన నిర్ణయమే తీసుకున్నట్లు  అర్దమవుతోంది.