VPR: వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి ఎందుకు రాజీనామా చేశారు? ఆయన అడుగులు ఎటువైపు?
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, నెల్లూరు అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వైసీపీలో సముచిత స్థానం దక్కిన.. సీఎం జగన్‌తో సన్నిహితంగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎందుకు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు? అనే అనుమానాలు వస్తున్నాయి. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన అడుగులు ఎటు? అనే చర్చ జరుగుతున్నది.
YSR Congress Party: వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం నెల్లూరు రాజకీయాలను కుదిపేసింది. వైసీపీ నాయకుల్లోనూ ఆయన నిర్ణయం సంచలనంగా మారింది. సీఎం జగన్‌తో ఆయనకు సన్నిహితం ఉన్నది. వాస్తవానికి వైసీపీ కీలక నాయకులు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయి రెడ్డిలకు సమానంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా మెదిలారు. వాస్తవానికి వైసీపీలో ఆయనకు సముచిత స్థానం కూడా ఉన్నది. రాజ్యసభ ఎంపీ పదవి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి ఇచ్చారు.
ఈ రోజు అనూహ్యంగా ఆయన నెల్లూరు వైసీపీ అధ్యక్ష పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ నిర్ణయం సంచలనమైంది. అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసేంత సమస్యలేమీ వచ్చాయి? ఆ అవసరం ఏమున్నది? అని అనేక కోణాల్లో సందేహాలు వస్తున్నాయి.
సంపన్న నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి ఆర్థికంగా కూడా నెల్లూరులో దన్నుగా నిలిచారు. నెల్లూరు ఎంపీ గెలుపుకోసం, ఇతర వైసీపీ అభ్యర్థులకూ ఆయన ఆర్థికంగా అండగా ఉన్నారు. కానీ, ఈ సారి ఎన్నికల నేపథ్యంలో పార్టీలో కీలక మార్పులు జరిగాయి. నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ ఆయనకు ఆఫర్ చేసినట్టు.. అందుకు వీపీఆర్ కూడా అంగీకారం తెలిపినట్టు సమాచారం. కానీ, తాను ఎంపీగా పోటీ చేయడానికి కండీషన్లు పెట్టినట్టు తెలిసింది. నెల్లూరులో కొన్ని గ్రూపు రాజకీయాలు ఆయనను ఇబ్బంది పెట్టాయని, కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ వంటి వర్గాలు సమస్యలుగా ఆయనకు అనిపించాయి.
Also Read: BJP: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మల్కజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్ పోటీ
అయితే.. అనిల్ కుమార్ యాదవ్‌ను ఎలాగోలా నర్సారావుపేట లోక్ సభ స్థానానికి ఇంచార్జీగా సీఎం జగన్ ప్రకటించారు. దీంతో వీపీఆర్ హ్యాపీ. కానీ, అనూహ్యంగా అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అనుచరుడైన ఖలీల్ అహ్మద్‌ను నెల్లూరు సిటీ అసెంబ్లీ సీటుకు ఇంచార్జీగా ప్రకటించారు. అదీ ఆయనకు సమాచారం ఇవ్వకుండానే ప్రకటించడంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అసహనానికి లోనయ్యారు. దీంతో సీఎం జగన్‌తో అపాయింట్‌మెంట్ కోసం వీపీఆర్ ప్రయత్నించినా.. దొరకలేదని తెలిసింది. అయితే.. ఓ సీనియర్ లీడర్ వీపీఆర్‌తో ఔట్ రైట్‌గా మాట్లాడినట్టు సమాచారం. నెల్లూరు లోక్ సభ సీటు కావాలా? వద్దా? వద్దంటే.. ప్రత్యామ్నాయంగతా వేరే వ్యక్తిని అభ్యర్థిగా ఎంచుకుంటామని స్పష్టం చేసినట్టు తెలిసింది.
ఇది వేమిరెడ్డిని అసంతృప్తికి గురి చేసింది. పార్టీ నుంచి మొత్తంగా బంధాలు తెగించుకుని, ప్రచారాన్ని అర్థంతరంగా నిలిపేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిసింది. ఫారీన్‌కు వెళ్లారు. ఇప్పుడు మళ్లీ వచ్చి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.
ఇది వరకే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్‌లో చంద్రబాబుతో కలిసినట్టు రాజకీయవర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉన్నది. అయితే.. విపక్షంలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిలో ఉన్న సంగతి తెలిసిందే. నెల్లూరు సిటీ అసెంబ్లీ సీటుకు డిమాండ్ ఉన్నది. కానీ, నెల్లూరు ఎంపీ సీటు దాదాపుగా టీడీపీకే ఖరారయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరితే.. నెల్లూరు ఎంపీ టికెట్ ఆయనకే దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Also Read: Farmers: కాంగ్రెస్‌ను గెలిపిస్తే రైతుల డిమాండ్లను అంగీకరిస్తుంది: ఖర్గే
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో రూప్ కుమార్ యాదవ్, పెద్దమొత్తంలో అనుచరులు టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. అనిల్ కుమార్ యాదవ్‌కు తొలినాళ్లలో రాజకీయ గురువుగా వ్యవహరించిన ఆయన బాబాయి రూప్ కుమార్ యాదవ్.. ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్‌తో ఆయనకు చెడింది. ఇప్పుడు నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ ను ప్రకటించడం, ఆయన అనిల్ కుమార్ యాదవ్‌కు ముఖ్య అనుచరుడు కావడంతో రూప్ కుమార్ యాదవ్ పార్టీ ఫిరాయించాలని చూస్తున్నారు. ఖలీల్ అహ్మద్, రూప్ కుమార్ యాదవ్‌లు ఇద్దరూ నెల్లూరు డిప్యూటీ మేయర్లు.