మొదటిసారిగా కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు నడుచుకుంటున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. పోలవరం కాంట్రాక్టర్ మార్పు చివరకు మిత్రపక్షాల మధ్య చిచ్చు పెట్టినా ఆశ్చర్యం లేదని భాజపా వర్గాలు అనుమానిస్తున్నాయి.

ఇంతకీ జరిగిందేంటి? పోలవరం పనులు వేగంగా జరగాలంటే ప్రస్తుత కాంట్రాక్టర్ ను మార్చాల్సిందేనని చంద్రబాడు పట్టుపట్టారు. అయితే, అందుకు కేంద్రం అంగీకరంచలేదు. కాంట్రాక్టర్ ను మారిస్తే అంచనా వ్యయం పెరిగిపోతుంది కాబట్టి మార్పుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించలేదు. అయితే, పెరిగుతాయనుకుంటున్న అంచనా వ్యయంను రాష్ట్రప్రభుత్వమే భరించేట్లయితే కేంద్రానికి ఎటువంటి అభ్యంతరం లేదని కూడా చెప్పారు.

ఇక్కడే చంద్రబాబు తన సొంత ఆలోచనతో ముందుకు సాగాలని నిర్ణయింకున్నారు. అంచనా వ్యయం పెరిగినా సరే కాంట్రాక్టర్ ను మార్చాల్సిందే అని నిర్ణయించారు. బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో అందుకు ఆమోదముద్ర కూడా వేయించుకోనున్నారు. ఎందుకంటే, రేపేదైనా సమస్య వస్తే మంత్రివర్గ సమిష్టి నిర్ణయమని చెప్పటానికి.

సరే, పెరిగే అంచనా వ్యయాలను రాష్ట్రం భరిస్తుందా లేదా అన్నది వేరే సంగతి. కేంద్రం వద్దన్న తర్వాత తన ఇష్టప్రకారం చంద్రబాబు ముందుకు వెళ్ళటం మాత్రం ఇదే మొదటిసారేమో. కాంట్రాక్టర్ మార్పు విషయంలో ఎందుకంత పట్టుదలతో ఉన్నారంటే, అక్కడే ఉంది చిందబర రహస్యం.

పోలవరం కాంట్రాక్టు సంస్ధ ట్రాన్ స్ట్రాయ్ కు చంద్రబాబుకు ఉన్న సంబంధాలు అందరికీ తెలిసిందే కాబట్టి కాంట్రాక్టు సంస్ధ మీద చంద్రబాబు ఈగ వాలనివ్వటం లేదు. మామూలుగా అయితే, ఒప్పందం ప్రకారం పనులు చేయని సంస్ధపై న్యాయపరమైన చర్యలకు ప్రభుత్వం దిగాలి. కానీ ఇక్కడున్నది చంద్రన్న ప్రభుత్వం కదా అందుకే రివర్స్ లో నడుస్తోంది.

గడచిన మూడున్నరళ్ళుగా కేంద్రం గీచిన గీటును చంద్రబాబు ఎప్పుడూ దాటలేదు. రాష్ట్రప్రయోజనాలు ముడిపడిన ప్రత్యేకహోదా, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన, రెవిన్యూలోటు భర్తీ ఇలా ఏ అంశంలోనూ కేంద్రంతో విభేదించని చంద్రబాబు ఓ కాంట్రాక్ట్ సంస్ధ విషయంలో మాత్రం కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా సొంత నిర్ణయం తీసుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. అయితే, తాజాగా చంద్రబాబు నిర్ణయం భవిష్యత్తులో ఏ పరిణామాలకు దారితీస్తుందో అని టిడిపి నేతలు ఆందోళనలో ఉన్నారు.