చంద్రబాబునాయుడును ప్రధానమంత్రి నరేంద్రమోడి ఏమాత్రం లెక్క చేయలేదా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ అవే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే, ప్రధాని-చంద్రబాబు ఫోన్లో మాట్లాడుకున్న తర్వాత కూడా టిడిపికి చెందిన కేంద్రమంత్రులు రాజీనామాలు చేశారంటే అర్ధమేంటి? టిడిపి మంత్రులు రాజీనామాలను మోడి చాలా లైట్ గా తీసుకున్నారని తెలిసిపోతోంది.

పైగా చంద్రబాబును బుజ్జగించేందుకు మోడి ప్రయత్నించారంటూ తన అనుకూల మీడియాలో టిడిపి రాయించుకున్నది. మోడి-చంద్రబాబు ఫోన్లో మాట్లాడుకున్నపుడు రాజీనామాలపై తొందరపడవద్దని ప్రధాని అనునయించేందుకు ప్రయత్నించారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రధాని మాటలను చంద్రబాబు తోసిపుచ్చారని రాజీనామాలకు నిర్ణయం తీసేసుకున్న విషయాన్ని కచ్చితంగా చెప్పారని కూడా రాయించుకుంటున్నారు.

నిజంగా అదే జరిగుంటే, రాజీనామాలు చేయటం కనీసం కొద్ది రోజులన్నా వాయిదా పడేదే. మోడి అంతటి నేత స్వయంగా చంద్రబాబును బుజ్జగించారంటే ఎవరూ నమ్మటం లేదు. ఎందుకంటే, గడచిన ఏడాదిన్నరగా చంద్రబాబుకు అసలు అపాయిట్మెంటే ఇవ్వని నరేంద్రమోడి చివరి నిముషంలో చంద్రబాబును బుజ్జగించారంటే  ఎవరు నమ్ముతారు?

గడచిన మూడు నెలలుగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు కావచ్చు లేకపోతే బిజెపి-టిడిపి మధ్య వ్యవహారాలు కావచ్చు జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే చంద్రబాబు బాగా ఇబ్బందులు పడుతున్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. చంద్రబాబుపై రాష్ట్రంలోని బిజెపి నేతలు ఒంటికాలిపై లేచి దుమ్ముదులిపేస్తున్నారు. జాతీయ నాయకత్వం అనుమతి లేందే రాష్ట్రంలోని నేతలు చంద్రబాబుపై అలా మాట్లాడగలరా? బిజెపినే చంద్రబాబును ఎన్డీఏలో నుండి ఎలా బయటకు సాగనంపాలా అని ఆలోచిస్తున్నట్లే కనబడుతోంది. జరుగుతున్న పరిణామాలు ఇలాగుంటే, టిడిపి మీడియా మాత్రం మోడికి వ్యతిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా ప్రచారం చేస్తుండటం విచిత్రం.