ప్రధానమంత్రి నరేంద్రమోడి ఏపిని ఏమాత్రం ఖాతరు చేయటం లేదన్న విషయం మరోమారు రుజువైంది. బడ్జెట్ లో ఏపి ప్రయోజనాలకు గానీ విభజన చట్టంలో పేర్కొన్న హామీల విషయంలో కానీ కేంద్రం పట్టించుకోని విషయం అందరికీ తెలిసిందే. ఆరురోజుల క్రితం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపి ఊసే లేకపోవటంతో రాష్ట్రం మొత్తం మండిపోతోంది.

ఇటువంటి నేపధ్యంలోనే చంద్రబాబునాయుడు కూడా కేంద్రంపై కాస్త సీరియస్ అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో ఆందోళనలు చేయండని, కేంద్ర ప్రభుత్వం వద్ద నిరసనలు తెలపండంటూ ఆదేశించారు. దాంతో రెండు రోజులుగా టిడిపి ఎంపిలు కూడా పార్లమెంటు లోపల బయట నిరసనలు తెలుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో వైసిపి ఎంపిలు కూడా ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారు.

అయితే, మంగళవారం పార్లమెంటులోనే ప్రధానమంత్రిని టిడిపి రాజ్యసభ సభ్యుడు, కేంద్రమంత్రి సుజనా చౌదరి కలిసారు. విభజన చట్టంలోని హామీల గురించి, రాష్ట్రప్రయోజనాలపైన 20 నిమిషాలు  ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే, సుజనా మాటలకు ప్రధాని పెద్దగా సానుకూలంగా స్సందించలేదని సమాచారం.

ఏపి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, ఏపికి కేంద్రం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందనే పడికట్టు పదాలనే వినిపించినట్లు సమాచారం. పోలవరం నిర్మాణానికి, రాజధానికి నిధులు ఇస్తోందని ప్రధాని చెప్పారట. ఎంపిలు అనవసరంగా ఆందోళనలు చేస్తున్నారని ప్రధాని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఏపి విషయంలో ప్రధాని పూర్తిగా నిర్లక్ష్యంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. నిజంగానే ప్రధాని చెప్పినట్లుగా కేంద్రానికి ఏపి అంత ప్రత్యేకమైన రాష్ట్రమే అయితే ఆ విషయం ఈ పాటికి చేతల్లో చూపేదే.