చంద్రబాబునాయుడు వైఖరి విచిత్రంగా ఉంది. ‘అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు’ అన్న సామెతలాగ  ప్రధానమంత్రి నరేంద్రమోడిని ఏమనలేక ఆ కోపాన్ని చివరకు వైసిపి ఎంపి విజయసాయిరెడ్డిపై మండిపడుతున్నారు. ఇంతకీ విజయసాయిపై చంద్రబాబుకు అంత కోపం ఎందుకొచ్చింది? అంటే, పీఎంవో కారిడార్‌లో వైసీపీ ఎంపీ విజయసాయి తిరుగతున్నారట. పిఎంవో కార్యాలయం వద్ద విజయసాయి తిరుగుతూ దర్యాప్తు సంస్థలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

మంగళవారం టీడీపీ సమన్వయకమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీఎంవో పరిసరాల్లోకి ఇలాంటి వారిని అనుమతించ కూడదన్నారు.  విజయసాయికి అపాయింట్‌మెంట్‌ ఇస్తే పీఎంవోకే కళంకమట. పిఎంవో వద్ద విజయసాయి తిరిగితే పిఎంవోకి ఏ విధంగా కళంకమో మాత్రం చంద్రబాబు చెప్పలేదు. తనపై ఉన్న కేసులను ప్రభావితం చేయటానికే విజయసాయి నాటకాలాడుతున్నట్లు చంద్రబాబు చెప్పటం విచిత్రంగా ఉంది.

చంద్రబాబు చెప్పిందే నిజమైతే చంద్రబాబు మీద కూడా కేసులున్నాయి కదా? బ్యాంకును మోసం చేసిన కేసులో టిడిపి ఎంపి, కేంద్రమంత్రి సుజనా చౌదరి మీద ఏకంగా అరెస్టు వారెంటే జారీ అయ్యింది కదా?

కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్ప, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజును విజయసాయి కలిసిన విషయాన్ని టీడీపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. వాళ్ళని విజయసాయి కలిస్తే చంద్రబాబుకు వచ్చే నష్టమేంటో అర్దం కావటం లేదు.  జగన్ తరపున వ్యవహారాలు చక్క పెడుతున్నది విజయసాయేనని ప్రచారం జరుగుతోంది. ప్రధాని-జగన్ భేటీల్లో విజయసాయిదే కీలక పాత్ర. అందుకనే ఆ ఆడిటర్ అంటే చంద్రబాబుకు అంత మంటగా ఉన్నట్లుంది. అపాయిట్మెంట్ ఇస్తున్న నరేంద్రమోడిని ఏమనలేక చివరకు విజయసాయిపై మండిపడుతున్నారు.

ప్రధానమంత్రి హామీలు ఇవ్వడం కాదని, ఇచ్చిన హామీలపై లోక్‌సభలో ప్రకటన చేసేంత వరకూ ఆందోళన చేస్తూనే ఉండాలని  ఎంపీలకు చంద్రబాబు సూచించారు. రాష్ట్రానికి ఏంచేస్తారో పార్లమెంట్‌లోనే ప్రధాని చెప్పాలని, ఆ తర్వాత ఆందోళనపై నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి ఎంపీలకు స్పష్టం చేశారు.