చంద్రబాబునాయుడు మొహం చాటేశారు. అవును నిజమే. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టి ఐదు రోజులైంది. బడ్జెట్లో ఏపి ప్రయోజనాలకు సంబంధించి, విభజన హామీల గురించి ఒక్క ప్రస్తావన కూడా లేకపోవటంతో రాష్ట్రంలో మంటలు మండుతున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుండి వరుసగా నేతలతో చంద్రబాబు సమావేశాలు పెడుతూనే ఉన్నారు. సమన్వయ కమిటీ సమావేశమన్నారు. తర్వాత క్యాబినెట్ సమావేశంలో చర్చించారు. ఆదివారం నాడు మళ్ళీ ఎంపిలతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.

ఇన్ని రకాలుగా పార్టీలోని నేతలతో సమావేశమవుతున్నారే గానీ మీడియాతో మాత్రం నేరుగా ఒక్కసారి కూడా మాట్లాడలేదు. పోయిన బడ్జెట్ సమయంలో ‘రెక్కలు విరిచేసి ఎగరమంటే ఎలా ఎగురుతా’మంటూ నిష్టూరంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈసారి బడ్జెట్ తర్వాత అసలు మీడియాను దగ్గరకే రానీయలేదు. ఎందుకంటే, బడ్జెట్ ద్వారా ఏపి విషయంలో తన వైఖరి ఏమిటో కేంద్రం స్పష్టం చేసింది. దాంతో చంద్రబాబు తల బొప్పి కట్టింది.

మీడియా ముందుకు వస్తే బడ్జెట్ పై ఏమని మాట్లాడాలో అర్ధం కాలేదట. కేంద్రంపై మండిపడాలి. లేకపోతే బడ్జెట్ బ్రహ్మాండమని చెప్పాలి. రెండు కూడా చెప్పే పరిస్ధితుల్లో లేరు. ఎందుకంటే, మూడున్నరేళ్ళు కేంద్ర ప్రభుత్వం బ్రహ్మండమన్న నోటితోనే ఇపుడు ఛీ..ఛీ అనలేరు. అందుకనే ఏకంగా మీడియా మొత్తాన్ని దూరంగా పెట్టేశారు. కాబట్టే చంద్రబాబు తరపున కేంద్రమంత్రి సుజనా చౌదరి, యనమల రామకృష్ణుడు, వర్లరామయ్య, బుచ్చయ్యచౌదరి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. మొత్తానికి బడ్జెట్ రూపంలో చంద్రబాబును ప్రధానమంత్రి నరేంద్రమోడి కోలుకోలేని దెబ్బే కొట్టారు.