ఐదురోజులుగా పార్లమెంటు వేదికగా జరుగుతున్న ఆందోళనలను గమనిస్తున్న వారికి ఓ అనుమానం మొదలైంది. అదేమిటంటే, టిడిపి ఎంపి, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఎక్కడా కనబడటం లేదు. పార్లమెంటులో కానీ బయటకానీ మొత్తం కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరే కనబడుతున్నారు. కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళనలు చేస్తున్న ఎంపిలతో కానీ లోక్ సభలో ఎంపిలు మాట్లాడుతున్న సమయంలో కానీ ఎక్కడా అశోక్ కనబడటం లేదు. దాంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కనీసం మీడియాతో కూడా రాజుగారు మాట్లాడటం లేదు.

గడచిన మూడున్నరేళ్ళల్లో కేంద్ర వైఖరిపై టిడిపి నిరసన తెలపటం ఇదే మొదటిసారి. గడచిన నాలుగు బడ్జెట్లలో ఏపికి కేంద్రం అన్యాయం చేసినా చంద్రబాబు పల్లెత్తు మాటనలేదు. ఇప్పుడే ఎందుకు ఇంతలా నిరసనలు మొదలుపెట్టారంటే రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అన్నది స్పష్టం. అటు కేంద్రంపైన కానీ ఇటు చంద్రబాబు ప్రభుత్వంపైన కానీ జనాలు మండిపోతున్నారు. ఆ విషయాన్ని గ్రహించిన చంద్రబాబు జనాల్లోని వ్యతిరేకతను కేంద్రంపై మళ్ళించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగమే ఎంపిల నిరసనలు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ కేంద్రం నిర్ణయంపై నిరసలు తెలపటంలో అర్ధమేలేదు.

ఇంత హడావుడి జరుగుతున్నా టిడిపి తరపున కేంద్రంలో క్యాబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న అశోక్ మాత్రం ఎక్కడా కనబడకపోవటమే ఆశ్చర్యపరుస్తోంది. టిడిపిలో అసలేం జరుగుతోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. జరుగుతున్న మొత్తం వ్యవహారం నుండ అశోక్ ను  చంద్రబాబే దూరం పెట్టారా? లేకపోతే అశోకే దూరంగా ఉంటున్నారా అన్నది పెద్ద ప్రశ్న.

కొంతకాలంగా కేంద్రమంత్రికి చంద్రబాబుకు మధ్య గ్యాప్ పెరిగిందన్నది మాత్రం వాస్తవం. విజయనగరం జిల్లా ఎంపి అయిన అశోక్ కు జిల్లాలోనే మాట చెల్లుబాటు కావటం లేదు. అశోక్ వ్యతిరేక గ్రూపును చంద్రబాబు పెంచిపోషిస్తున్నారు. అందులో భాగంగానే గంటా శ్రీనివాసరావును చంద్రబాబు ఏరికోరి విజయనగరం జిల్లాకు ఇన్చార్జిగా నియమించారు. అక్కడి నుండి అశోక్ కు జిల్లా పార్టీలో వ్యతిరేక గళాలు వినబడుతున్నాయి. దానికితోడు ప్రధానమంత్రి నరేంద్రమోడి కూడా అశోక్ ను బిజెపిలో చేరమని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే అశోక్ ను చంద్రబాబే దూరంగా ఉంచారా అన్న అనుమానాలు మొదలయ్యాయి.