టిడిపికి మద్దతుగా ఉండే మీడియాలో ఇంతకాలం చంద్రబాబునాయుడు లీకులతో రాయించుకున్న వార్తలే కొంపముంచాయా? పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. బిజెపి నేతలు కూడా ఆ విషయం మీదే చంద్రబాబుపై మండిపడుతున్నారు. ఫిబ్రవరిలో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది మొదలు ఏపిలో రాజకీయంగా హీట్ పెరిగిపోయింది. ఎందుకంటే, బడ్జెట్లో ఏపి ప్రయోజనాలపై కనీసం ఒక్క ప్రస్తావన కూడా లేదు.

అందులోనూ వచ్చే ఎన్నికలకు ముందు మొన్న ప్రవేశపెట్టిందే చివరి బడ్జెట్. దాంతో చంద్రబాబులో ఎన్నికల భయం మొదలైంది. ఒకవైపు జనాల్లో పెరిగిపోతున్న వ్యతిరేకత. ఇంకోవైపు కేంద్రం నుండి అందని సాయం. దాంతో చంద్రబాబుకు ఏం చేయాలో తోచలేదు. జనాల్లో పెరిగిపోతున్న ఆగ్రహం నుండి తాను తప్పుకుని మొత్తం జనాగ్రహాన్ని కేంద్రంపైకి మళ్ళించాలని వ్యూహం పన్నారు.

అప్పటి నుండి టిడిపికి మద్దతిచ్చే మీడియాలో కేంద్రానికి వ్యతిరేకంగా వార్తలు రాయించుకోవటం మొదలుపెట్టారు. సీనియర్ నేతలతో సమావేశమైనా, పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలోనూ ‘కేంద్రంపై మండిపడిన చంద్రబాబు’...‘చంద్రబాబు ఆగ్రహానికి దిగొచ్చిన కేంద్రం’ ..‘చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి ఫోన్..అమిత్ షా ఫోన్’ అంటూ పదే పదే రాయించుకున్నారు. నిజంగానే వాళ్ళు చంద్రబాబుకు ఫోన్ చేశారో లేదో తెలీదు. ‘పొత్తుల విషయంలో ఎటువంటి హేస్టీ డెసిషన్ తీసుకోవద్దంటూ చంద్రబాబును బ్రతిమలాడుకున్న బిజెపి పెద్దలు’ అంటూ టిడిపి మీడియా ఒకటికి పదిసార్లు ఒకటే ఊదరగొట్టాయి. కేంద్రానికి వ్యతిరేకంగా, చంద్రబాబుకు మద్దతుగా స్ధానిక మీడియాలో వస్తున్న వార్తలన్నింటినీ బిజెపి నేతలు ఎప్పటికప్పుడు జాతీయ నాయకత్వానికి చేరవేస్తున్నారు.

దాంతో క్షేత్రస్ధాయిలో జరుగుతున్నదొకటైతే టిడిపి మీడియాలో చంద్రబాబు రాయించుకుంటున్నది ఇంకోటని బిజెపి పెద్దలకు బాగా అర్ధమైపోయింది. ఈ దశలో డిమాండ్లకు తలొంచినా అది తన ఘనతగానే చంద్రబాబు ప్రచారం చేసుకుంటారన్న విషయాన్ని బిజెపి పెద్దలు గ్రహించారు. రాష్ట్రానికి రావల్సినవి రాబట్టుకున్న తర్వాత సరిగ్గా ఎన్నికల ముందు చంద్రబాబు పొత్తులు కటీఫ్ అంటే బిజెపి చేయగలిగేది కూడా ఏమీలేదు.

అందుకే చంద్రబాబు ఆలోచనలను పసిగట్టిన బిజెపి తన నిర్ణయం తాను తీసుకుంది. ఎటుతిరిగీ వచ్చే ఎన్నికల్లో బిజెపికి పెద్ద ఆశలేమీ లేవు. పైగా ఒంటరిగా పోటీ చేయాలని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారు. దాంతో బిజెపి కూడా చంద్రబాబును లైట్ గా తీసుకుంది. లీకుల రూపంలో మీడియా ద్వారా జనాగ్రహాన్ని తమపైకి చంద్రబాబు మళ్ళిస్తున్న విషయం ఢిల్లీలోని బిజెపి నాయకత్వం గ్రహించింది. మొత్తం మీద చంద్రబాబు రాయించుకున్న లీకు వార్తలే కొంపముంచినట్లు స్పష్టమవుతోంది.