టిటిడి ఛైర్మన్ పదవి ఇద్దరి నేతల్లో ఎవరో ఒకరికి దక్కే అవకాశాలున్నట్లుగా పార్టీలోని సన్నిహిత వర్గాలు చెప్పాయి. బహుశా పాలకవర్గ పదవీ కాలం అయిపోతోంది కాబట్టి ఈనెలాఖరులోగా నూతన పాలకవర్గాన్ని భర్తీ చేసే అవకాశాలున్నాయి.

తిరుమల తిరుపతి దేవస్ధానం పాలకమండలి ఛైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందనే విషయంలో సర్వత్రా ఉత్కంఠ పెరిగిపోతోంది. ఎందుకంటే ప్రస్తుత పాలకమండలి పదవీ కాలం రేపటితో పూర్తవుతోంది. అధికార పార్టీలోని అనేకమంది ఛైర్మన్ పదవి కోసం చంద్రబాబునాయుడు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే విశ్వసనీయవర్గాల ప్రకారం ఛైర్మన్ అయ్యే అవకాశాలు ఇద్దరి మధ్యే ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి, ఎంఎల్సీ గాలి ముద్దుకృష్ణమనాయడు, గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, ఎంఎల్ఏ దూళిపాళ నరేంద్ర మధ్య పోటీ ఉన్నట్లు సమాచారం.

కాగా దశాబ్దాల పాటు టిటిడి ఛైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేసుకుంటున్న నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావుకు మరోసారి భంగపాటు తప్పేట్లు లేదు. చంద్రబాబును కలిసి ఛైర్మన్ పదవి తనకు ఇవ్వాల్సిందిగా రాయపాటి కోరినప్పటికీ లాభం లేకపోయిందని ప్రచారం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు పనుల కాంట్రాక్ట్ ను ఇచ్చినందున ఇక టిటిడి ఛైర్మన్ పదవిని అడిగి తనను ఇబ్బంది పెట్టవద్దని చంద్రబాబు రాయపాటికి స్పష్టంగా చెప్పారట. పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తున్న ట్రాన్ ట్రాయ్ సంస్ధ రాయపాటిదే అన్న విషయం తెలిసిందే కదా?

సిఎం స్పష్టంగా చెప్పటంతో రాయపాటి కూడా ఆశలు వదిలేసుకున్నారనే అంటున్నారు పార్టీలోని నేతలు. దాంతో ఛైర్మన్ పదవి కోసం పలువురు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసారు. అయితే, ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో దూళిపాళ, గాలికి తీవ్ర నిరాసే ఎదురైంది. దాంతో ఇద్దరూ అలిగారు. అంతేకాకుండా తమ అసంతృప్తిని కూడా బాహాటంగానే చూపించారు. దాంతో ఇద్దరినీ సిఎం తన వద్దకు పిలిపించుకుని హామీలిచ్చినట్లు సమాచారం. దాన్ని బట్టి టిటిడి ఛైర్మన్ పదవి ఇద్దరి నేతల్లో ఎవరో ఒకరికి దక్కే అవకాశాలున్నట్లుగా పార్టీలోని సన్నిహిత వర్గాలు చెప్పాయి. బహుశా పాలకవర్గ పదవీ కాలం అయిపోతోంది కాబట్టి ఈనెలాఖరులోగా నూతన పాలకవర్గాన్ని భర్తీ చేసే అవకాశాలున్నాయి.