రాష్ట్రం మొత్తం మీద గొడవలు లేని జిల్లా ఒక్కటి కూడా కనబడదు. ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకూ ఉన్న ప్రతీ జిల్లాలోనూ నేతల మధ్య గొడవలే.

పార్టీలో పెరిగిపోయిన క్రమశిక్షణా రాహిత్యంపై చంద్రబాబునాయుడు ఇప్పటికి కళ్ళు తెరిచారు. గడచిన రెండున్నరేళ్లలో పార్టీ నేతల మధ్య ఎన్ని విభేదాలున్నా ఏనాడూ పట్టించుకోలేదు. తాజాగా జరిగిన పార్టీ సమన్వయ భేటీలో చంద్రబాబు పార్టీ నేతలపై మండిపడ్డారు. ఇకపై పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోనంటూ హూంకరించారు. అదే సందర్భంలో మంత్రలు అచ్చెన్నాయడు, రావెల కిషోర్ బాబు తదితర మంత్రులకు తీవ్ర హెచ్చిరకలు కూడా జారీ చేయటం గమనార్హం.

ఇదంతా ఓకేనే గానీ ఇక్కడే ఓ విషయం అర్ధం కావటం లేదు. ఇంతకాలం పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలను చంద్రబాబు ఎందుకు పరిష్కరించలేదు? చంద్రబాబంటే బిజీగా ఉన్నారనుకుందాం. కుమారుడు లోకేష్ కు అప్పజెప్పిన బాధ్యతలే అవికదా? నేతల మధ్య సమన్వయం కరువైందంటే అందుకు కారణం సమన్వయ కమిటీ కన్వీనర్ లోకేషే కదా బాధ్యత వహించాల్సింది?

అసలు ఈ స్ధాయిలో నేతల మధ్య ఎందుకు సమన్వయం లోపించింది? అందుకు చంద్రబాబే కదా బాధ్యుడు? వైసీపీ నుండి ఫిరాయింపులను స్వయంగా ప్రోత్సహిస్తున్నదే చంద్రబాబు. వైసీపీ నుండి టిడిపిలోకి 21 మంది ఎంఎల్ఏలు ఫిరాయించారు. వచ్చిన వాళ్ళు ఊరకే వుండరు కదా? తమ ఉనికిని చాటు కోవటానికి ప్రయత్నిస్తారు. దాంతో కొత్త తమ్ముళ్ళకు పాత తమ్ముళ్ళకు మధ్య ఆధిపత్య గొడవలు మొదలయ్యాయి. మొదట్లో చంద్రబాబే చూసీ చూడనట్లు వదిలేసారు. ఆగొడవలు ముదిరిపోయి రోడ్డున పడుతున్నాయి. ఇపుడు వాటిని అదుపుచేసే స్ధాయిలో చంద్రబాబు కూడా లేరు. ఎందుకంటే, కొత్త తమ్ముళ్లను అదుపు చేయలేరు, పాత తమ్ముళ్ళకు సర్ది చెప్పలేరు.

రాష్ట్రం మొత్తం మీద గొడవలు లేని జిల్లా ఒక్కటి కూడా కనబడదు. ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకూ ఉన్న ప్రతీ జిల్లాలోనూ నేతల మధ్య గొడవలే. ఎన్నిసార్లు పంచాయితీలు చంద్రబాబు ముందుకు వచ్చినా ఏదో అప్పటికప్పుడు సర్దుబాటు చేసి పంపేయటం తప్ప శాస్వత పరిష్కారం చేసింది ఎన్నడు? దాంతో చంద్రబాబు చెప్పినా నేతెలవరూ పట్టించుకోవటం లేదు. నేతలపై చంద్రబాబు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటే ఎవరిపైన తీసుకోవాలి? ఎందరిమీద తీసుకోవాలన్నదే ప్రధాన ప్రశ్న. అపుడు పార్టీలో ఉండే నేతలెవరు?