అమరావతి:జగన్ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాల కొనుగోలులో అవినీతి చోటు చేసుకొందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు.ఎస్సీలకు హోంమంత్రి పదవిచ్చారు. కానీ,ఎస్సీలకు గుండు కొట్టించారని వైసీపీ ప్రభుత్వంపై  ఆయన మండిపడ్డారు

మంగళవారం నాడు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. మాజీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నుండి వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.చంద్రబాబు హయంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణం పథకంలో అవినీతి చోటు చేసుకొందని ఆయన ఆరోపించారు.

2024లో ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చే లక్ష్యంతోనే ముందుకు సాగుతామని  ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఏపీ అభివృద్ధికి బీజేపీ, జనసేన సంయుక్తంగా పనిచేస్తాయన్నారు.

ఏపీ రాజకీయాల్లో బీజేపీ వాణిని విన్పించాల్సిన అవసరం ఉందని  బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ఏపీకి బీజేపీ అవసరం ఉందన్నారు. నిజమైన అభివృద్ధి ఏపీకి అవసరమన్నారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్  అంటే అందరి జీవితాల్లో వెలుగులు నింపడమే అని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందేలా చూడాల్సిన అవసరమన్నారు.

తాను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం తనకు సహకరించిన ప్రతి ఒక్కరిని మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ధన్యవాదాలు తెలిపారు. తన వల్ల కష్టం కలిగినా నష్టం కలిగినా క్షమించాలని ఆయన కోరుకొన్నారు. 

also read:అమరావతిపై వ్యాఖ్యలు: బీజేపీ నుండి వెలగపూడి గోపాలకృష్ణ సస్పెన్షన్

పార్టీని బలోపేతం చేసే ఉద్దేశ్యంతోనే తాను పార్టీ కోసం పనిచేశానని ఆయన చెప్పారు. వ్యక్తిగతంగా తనకు ఎవరిపై ఎలాంటి కోపతాపాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత సోము వీర్రాజుకు ఆయన శాలువా కప్పి సన్మానించారు. కన్నా లక్ష్మీనారాయణ సోము వీర్రాజుకు బాధ్యతలు అప్పగించారు.