అమరావతి: 2019 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అన్ని రాజకీయ పార్టీలు మహాకూటమిగా ఏర్పడుతున్నట్టుగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.  బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ది బీజేపీ ఎజెండా అని బాబు నిప్పులు చెరిగారు. తమ కూటమిలో చేరనివారంతా బీజేపీ మద్దతుదారులేనని బాబు తేల్చేశారు.

కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ మాజీ సీఎం ఆశోక్ గెహ్లాట్ శనివారం నాడు  ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో  అమరావతిలో సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత గెహ్లాట్‌తో కలిసి చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు.

రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  నోట్ల రద్దు జరిగి రెండేళ్లు దాటినా కూడ ఫలితం రాలేదన్నారు.ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు.  నోట్ల రద్దు కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనంతటికి కేంద్రమే బాధ్యత వహించాలని బాబు అభిప్రాయపడ్డారు. 

సీబీఐ అవినీతిలో కూరుకుపోయిందన్నారు. దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలను  బీజేపీ నాశనం చేసిందన్నారు. విభజన చట్టంలో పొందుపర్చిన ఏ అంశాలను కూడ కేంద్రం అమలు చేయలేదన్నారు.దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. 

ఆర్భీఐ స్వయంప్రతిపత్తిని కోల్పోయే పరిస్థితి నెలకొందన్నారు. ఈ విషయాలపై ఎవరూ మాట్లాడినా కూడ దాడులు చేసే పరిస్థితి నెలకొందన్నారు.  మోడీ, అమిత్‌షాలు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని బాబు  విమర్శించారు.

జనవరి 19 లేదా 20 తేదీల్లో మమత బెనర్జీతో చర్చించనున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు. 22 వ తేదీన బీజేపీ వ్యతిరేక పక్షాల సమావేశం ఏర్పాటు చేయాలని  భావిస్తున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు. 

ఇప్పటికే  కొన్ని పార్టీలతో తాను  మాట్లాడినట్టు చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. మమతతో ఫోన్లో చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. ఢిల్లీలో బీజేపీ వ్యతిరేక పార్టీల సమావేశాని కంటే ముందే తాను మమతతో చర్చించనున్నట్టు బాబు స్పష్టం చేశారు.

తెలంగాణ ఎన్నికల్లో ఏం చేయాలనే దాన్ని  తెలంగాణ నేతలు నిర్ణయం తీసుకొంటారని చంద్రబాబునాయుడు చెప్పారు. దేశంలోని బీజేపీయేతర అన్ని పార్టీలతో తాను చర్చించినట్టు ఆయన తెలిపారు. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఢిల్లీ నుండి రిమోట్ కంట్రోల్ ద్వారా బీజేపీ నడుపుతోందన్నారు.

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కూడ బీజేపీ  ఎజెండాను అమలు చేస్తోందని  చంద్రబాబునాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ గుప్పిట్లో తెలంగాణ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని చంద్రబాబునాయుడు విమర్శించారు.

దేశంలో బీజేపీ అనుకూల బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌‌లు మాత్రమే ఉన్నాయన్నారు.  ఎటువైపు ఉండాలో తేల్చుకోవాలని ఎంఐఎంకు చంద్రబాబునాయుడు సూచించారు. తమ కూటమిలో చేరని వాళ్లంతా బీజేపీ మద్దతుదారులేనని  చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు.

తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే మహాకూటమి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మైనార్టీల్లో అభద్రత భావం పెరిగిందన్నారు. తెలంగాణ, ఏపీ రాజకీయాల గురించి చర్చించలేదన్నారు. ఎన్నికలు జరుగుతున్నందున  కొన్ని పార్టీలు ఇప్పుడే తమ కూటమిలో చేరకున్నా.. ఎన్నికల తర్వాత కొన్ని పార్టీలు తమ కూటమిలో చేరే అవకాశం లేకపోలేదని బాబు అభిప్రాయపడ్డారు.

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ వాతావరణం నెలకొందని ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆశోక్ గెహ్లాట్  ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మోడీ చెప్పిన విషయాలేవీ జరగలేదన్నారు. 
 

సంబంధిత వార్తలు

ఏపీలో కూడ టీడీపీతో పనిచేసే అంశాన్ని చర్చిస్తాం: ఆశోక్ గెహ్లాట్

చంద్రబాబు ఇంట్లో విందు, హాజరుకానున్న రాహుల్, మమత

గతాన్ని వదిలేసి పనిచేస్తాం: బాబుతో కలిసి రాహుల్