చంద్రబాబులో ‘సోమవారం’ టెన్షన్

చంద్రబాబులో ‘సోమవారం’ టెన్షన్

సోమవారమంటే తెలుగుదేశంపార్టీలో ఆందోళన పెరిగిపోతోంది. చంద్రబాబునాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరుల్లో అయితే టెన్షన్ చెప్పనే అక్కర్లేదు. ఇంతకీ టిడిపికి సోమవారం అంటే అంత ఆందోళన ఎందుకు? ఎందుకంటే, ‘పోలవరం-చంద్రబాబు’ బండారాన్ని సోమవారం పూర్తి ఆధారాలతో బయటపెడతా అంటూ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రకటించారు కాబట్టే. పోలవరం నిర్మాణం, చేసిన ఖర్చులు తదితరాలపై ఎవరికీ ఎటువంటి సమాచారం అందకుండా ప్రభుత్వం వీలైనంత జాగ్రత్తలు తీసుకుంది. కాబట్టే ఎవరడిగినా ఉన్నతాధికారులు సరైన సమాచారం ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారట.

అందులో భాగంగానే ఉండవల్లి కూడా పోలవరంకు సంబంధించిన వివరాలు కావాలని అడిగారు. షరా మామూలుగానే ఉన్నతాధికారులు పెద్దగా స్పందించలేదు. దాంతో ఉండవల్లి సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించారు. వెంటనే దరఖాస్తును పరిశీలించిన సమాచార హక్కు చట్టం ఉన్నతాధికారులు ఉండవల్లికి అవసరమైన సమాచారాన్ని ఇవ్వాలంటూ ఆదేశించారు. దాంతో అధికారులు ఉండవల్లితో మాట్లాడారు. తమ కార్యాలయానికి వచ్చి కావాల్సిన సమాచారాన్ని తీసుకోవచ్చంటూ చెప్పారు.

వెంటనే ఉండవల్లి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కార్యాలయంతో పాటు ఇరిగేషన్ కార్యాలయంకు వెళ్ళి చాలా ఫైళ్ళే తిరగేసారు. తనకు కావాల్సిన సమాచారాన్ని తీసుకున్నారు. దానిపై అధ్యయనం చేసి సోమవారం పోలవరం బండారాన్ని బయటపెడతానంటూ ప్రకటించారు. అంటే అప్పటికే పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, అవినీతిని కూడా సేకరించి పెట్టుకున్నారట. దానికితోడు తాజాగా అధికారిక సమాచారం కూడా సేకరించుకున్నారు. దాంతో ‘పోలవరం-చంద్రబాబు’ బండారాన్ని బయటపెడతా అని ప్రకటించగానే ఆందోళన మొదలైంది.

మామూలుగానే ఉండవల్లి సంధించే ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద రిప్లై ఉండదు. ఎందుకంటే, ఉండవల్లి చాలామంది నేతల్లా ఏది పడితే అది మాట్లాడే రకంకాదు. తెలివైన రాజకీయ నేతే కాకుండా లాయర్ కూడా. దాంతో మాటలు చాలా లాజికల్ గా ఉంటుంది. వాదనను కూడా జాగ్రత్తగా బిల్డప్ చేస్తారు. అందుకనే ఉండవల్లి చేసే ఆరోపణలను ప్రభుత్వం విననట్లే నటిస్తుంటుంది. మంత్రులు, టిడిపి నేతలు కూడా తొందరగా స్పందించరు. అందుకనే సోమవారం పోలవరంపై సోమవారం మాట్లాడుతా అని చెప్పగానే టిడిపిలో ఆందోళన పెరిగిపోతోంది. మరి, సోమవారం ఉండవల్లి సృష్టించబోయే సంచలనం కోసం ఎదురు చూడాల్సిందే.

 

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page