చంద్రబాబునాయుడు ఎన్నికల నిర్వహణ,  రాజకీయ వ్యూహల ముందు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ తట్టుకోలేరని  రాజమండ్రి మాజీ ఎంపీ  ఉండవల్లి అరుణ్‌కుమార్  అభిప్రాయపడ్డారు

న్యూఢిల్లీ:చంద్రబాబునాయుడు ఎన్నికల నిర్వహణ, రాజకీయ వ్యూహల ముందు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ తట్టుకోలేరని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో కూడ వైసీపీ విజయం సాధిస్తోందని ప్రచారం జరిగినా... కానీ లెక్కలు తేలేసరికి టీడీపీ ఆధిక్యం సాధించిందని ఆయన గుర్తు చేశారు.

2019 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు. వైఎస్ జగన్ సభలకు జనం వీపరీతంగా వస్తున్నా ఎన్నికల వ్యూహంలో ఆ పార్టీ వెనుకబడుతోందన్నారు.

బుధవారం నాడు ఉండవల్లి అరుణ్‌కుమార్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లారు. ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఎన్నికల నిర్వహణ, రాజకీయ వ్యూహల ముందు జగన్ తట్టుకోలేరని ఉండవల్లి అరు‌ణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. 2014 ఎన్నికల ఫలితాలను ఆయన ప్రస్తావించారు. ఎన్నికల ముందు కూడ వైసీపీ విజయం సాధిస్తోందని ప్రచారం జరిగినా అందుకు విరుద్దంగా జరిగిందన్నారు. 

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గురించి ఇప్పటికిప్పుడే చెప్పలేమన్నారు. 2014లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో... ఇవాళ ఏపీలో బీజేపీ పరిస్థితి కూడ అదే మాదిరిగా ఉందన్నారు. ప్రత్యేక హోదా అంశం భావోద్వేగంగా మారిందన్నారు. ఇదే అంశం ఏపీ రాజకీయాలను నిర్ధేశిస్తోందన్నారు. 

ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాతో ప్రయోజనం లేకపోవచ్చు.. కానీ, ఆంధ్రకు ఎంతో ప్రయోజనం కలుగుతోందన్నారు. రాయితీలు వేరు, హోదా వేరన్నారు. 2014లో రాజ్యసభలో ఏపీ విభజనపై జరిగిన చర్చ సందర్భంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు వస్తాయనేది అందరి అభిప్రాయంగా ఉందన్నారు. అందుకే ఆనాడు పదేళ్లపాటు ప్రత్యేక హోదా కావాలని వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారని ఆయన గుర్తు చేశారు. 

రాష్ట్ర విభజనను తాను వ్యతిరేకించడం లేదన్నారు. విభజన చేసిన తీరునే తాను ప్రశ్నించాలని చెబుతున్నట్టు ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు. అశాస్త్రీయంగా అప్రజాస్వామికంగా రాష్ట్ర విభజన జరిగిందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ సభ్యుల అభ్యంతరాల గురించి ఆయన ప్రస్తావించారు. 

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హమీని నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. మరో వైపు తాను రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. అయితే ఏ పార్టీలో లేనన్నారు. అంతేకాదు ఏ పార్టీలో కూడ చేరబోనని ఆయన తెలిపారు.