విజయనగరం జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ స్వాతి రాణి.. ఎంపీ సీటుపై కన్నేశారు. గిరిజన కోటాలో జడ్పీ ఛైర్ పర్సన్ పదవిని దక్కించుకున్న స్వాతి.. ఇప్పుడు అదే కోటాలో ఎంపీ పదవి దక్కించుకోవాలని చూస్తున్నారు. అది కూడా విశాఖ జిల్లాలోని అరకు లోక్ సభస్థానాన్ని.

గత ఎన్నికల్లో అరకు ఎంపీగా కొత్తపల్లి గీత విజయం సాధించారు. వైసీపీ గుర్తుతో గెలిచిన ఆమె తర్వాత టీడీపీలోకి ఫిరాయించారు. పేరుకి ఆమె అరకు ఎంపీ అయినప్పటికీ.. ఎక్కువగా అక్కడ ఉన్నది లేదు. నగరంలో ఉంటూ అప్పుడప్పుడూ చుట్టపుచూపుగా వెళ్లి వచ్చేవారు. అంతేకాకుండా పార్టీ ఫిరాయించడంతో ఇప్పుడు ఆమెకు రెండు పార్టీల్లోనూ పెద్దగా గుర్తింపు దక్కలేదు. దీనిని స్వాతిరాణి తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు.

ఉత్తరాంధ్రలోని గిరిజనుల కోసం ప్రత్యేకంగా కేటాయించిందే అరుకు లోక్‌సభ స్థానం. ఇక్కడ నుంచి తెలుగుదేశంపార్టీ తరఫున పోటీ చేయాలన్నది శోభా స్వాతిరాణి ఆశయం.. ప్రస్తుతం విజయనగరం జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలను నిర్వరిస్తున్న ఆమె తన ఆశయసాధన కోసం ఇప్పటి నుంచే మంత్రాంగం మొదలుపెట్టారు. ఈ వ్యవహారంలో స్వాతిరాణి భర్త గులిపల్లి గణేశ్‌ చక్రం తిప్పుతున్నారు. 

భార్యభర్తలిద్దరూ ప్రతికూల అంశాలను సైతం తమకు అనుకూలమైనవిగా మలచుకునే పనిలో పడ్డారు. కులపరంగా.. విద్యాపరంగా తమకు సరితూగే అభ్యర్థి లేరని తెగేసి చెబుతున్నారు. అరుకు లోక్‌సభ పరిధిలో ఉన్న నియోజకవర్గాలలో అభివృద్ధి పథకాలను మంజూరు చేయించుకుంటున్నారు.

అంతేకాకుండా అరకు లోక్ సభ పరిధిలోని తమ కులపువారిని కూడా ఆకర్షించే పనిలో పడ్డారు భార్యభర్తలు ఇద్దరూ. వచ్చే ఎన్నికల్లోపూ అధిష్టానంతో మాట్లాడి.. ఎలాగైనా అరకు లోక్ సభ స్థానం సీటు దక్కించుకొని ఎన్నికల విజయ ఢంకా మోగించాలని భావిస్తున్నారు.