కరెంట్ షాక్ తో కాళ్లూ, చేతులు పోయినా.. పట్టుదలతో బిజినెస్ స్కూల్లో సీటు.. ఓ వైజాగ్ కుర్రాడి విజయగాథ..

ఓ యువకుడు కాళ్లూ, చేతులు కోల్పోయినా.. పట్టుదలతో చదువుకుని ఐఐఎమ్ అమ్మదాబాద్ లో సీటు సంపాదించాడు. ఎంతో మందికి స్పూర్తిగా నిలిచాడు.

Vizag youth lost his all 4 limbs in accident, enters IIM-Ahmedabad - bsb

విశాఖపట్నం : ఓ ప్రమాదం అతడిని కాళ్లు, చేతులు లేని అంగవికలుడిగా చేసింది. కానీ అతని మనసును మాత్రం అంగవైకల్యం తాకలేకపోయింది. అతని సంకల్పం ముందు విధి రాసిన రాత చిన్నబోయింది. పట్టుదల అతడిని భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన బిజినెస్ స్కూల్‌లలో ఒకటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ - అహ్మదాబాద్ (IIM-A)లోకి అడుగుపెట్టేలా చేసింది. 

దీనికి సంబంధించిన వివరాలలోకి వెడితే.. ద్వారపురెడ్డి చంద్రమౌళి విశాఖపట్నం సమీపంలోని చిన్న పట్టణానికి చెందిన వాచ్‌మెన్ కొడుకు. ఓ ఘోర ప్రమాదంలో రెండు కాళ్లు, రెండు చేతులు కోల్పోయాడు. కానీ అవేవీ అతని పోరాట స్ఫూర్తిని తగ్గించలేదు. మేనేజ్‌మెంట్ బ్యాచ్‌లో 2023-25 ​​పోస్ట్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కోసం అతను త్వరలో భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన బి-స్కూల్‌లలో ఒకటైన - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ - అహ్మదాబాద్ లోకి అడుగుపెట్టబోతున్నాడు.

భేష్.. వెన్నుముక గాయంతోనే పరీక్షలు.. టెన్త్ లో 9.7జీపీఏ సాధించిన విద్యార్థి...

చంద్రమౌళికి ఒక సోదరి ఉంది. ఓ రోజు ఆమె ఉంగరం ఇంటిముందున్న షెడ్డులో పడిపోయింది. ఆ ఉంగరాన్ని తీస్తుండగా చంద్రమౌళికి హైవోల్టేజీ కరెంట్ వైర్ తగిలింది. దీంతో తీవ్ర విద్యుదాఘాతానికి లోనయ్యాడు. అతడిని కాపాడేందుకు వైద్యులు అతని కాళ్లు, చేతులు తీసేయాల్సి వచ్చింది. కానీ, ఇదేమీ తనను కుంగదీయలేదని చంద్రమౌళి తెలిపాడు.

"నేను విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్‌లో దాదాపు మూడు నెలల పాటు ఉన్నాను. కానీ నా కుటుంబం, స్నేహితులు ఆ సమయాల్లో నాకు మానసిక, శారీరక సహాయాన్ని అందించడం ద్వారా నాకు ఎంతో మేలు చేసారు. వారు నా శ్రేయస్సు కోసం తమ సమయాన్ని వెచ్చించారు. ఇది నాకు సహాయపడింది. భావోద్వేగానికి లోనుకావడం.. సమాజంలో ఇక మామూలుగా తిరగలేనన్న బాధను తీసేసింది" అని చెప్పాడు. 

మొదట్లో చంద్రమౌళి లా పట్టా పొంది అమెజాన్‌లో ఉద్యోగం సంపాదించాడు. అతను ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. "నేను జీవితంలో ఎప్పుడూ ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. అందుకే నేను నా స్వంతంగా క్యాట్ కోసం సిద్ధంకావడం ప్రారంభించాను. ఈ ప్రయాణంలో, నేను పోటీ పరీక్షలో విజయం సాధించడంలో నాకు యూ ట్యూబ్ వంటి పబ్లిక్ ఆన్‌లైన్ వీడియో-షేరింగ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు సహాయపడ్డాయి. వీటిని నేను సద్వినియోగం చేసుకున్నాను. క్యాట్‌లో 87 పర్సంటైల్ (వికలాంగుల విభాగంలో) నేను స్కోర్ చేసాను. ఇక ఐఐఎం-ఎలో నా ఎంబీఏ తరగతులు జూన్‌లో ప్రారంభమవుతాయి" అని చంద్ర మౌళి తెలిపారు.

ఆయన ప్రస్తుతం కృత్రిమ కాళ్లతో నడుస్తున్నాడు.  చంద్రమౌళి తండ్రి  వెంకట రమణ మాట్లాడుతూ.. ‘అతనెప్పుడూ తానేం కోల్పోయానో అనేది కాకుండా.. ఉన్నదానితో ఏం సాధించాలో అనే దానిమీదే ఫోకస్ చేశాడు’ అని చెప్పుకొచ్చాడు. తండ్రి చాలా సంవత్సరాల క్రితం తన పిల్లల చదువుల కోసం తన కుటుంబాన్ని రావికమతం గ్రామం నుండి విశాఖపట్నానికి 100 కి.మీ దూరంలో ఉన్న నర్సీపట్నానికి మార్చాడు. గతంలో చిరువ్యాపారం చేసుకున్న వెంకట రమణ ప్రస్తుతం నర్సీపట్నంలోని రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ హాస్టల్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. తన కొడుకు ఐఐఎం-ఎ కలను నెరవేర్చుకునేందుకు బ్యాంకు రుణం తీసుకున్నట్లు చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios