Asianet News TeluguAsianet News Telugu

వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్.. సీఎం క్యాంపు ఆఫీస్ లోని ముఖ్య వ్యక్తికి సీబీఐ నోటీసులు..

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఓ కీలకపరిణామం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సీఎం క్యాంపు కార్యాలయంలోని ఓ ముఖ్యమైనవ్యక్తి సహాయకుడికి సీబీఐ నోటీసులు అందాయి. 

Vivekananda Reddy's murder case : CBI notices to person in CM's camp office, andhrapradesh - bsb
Author
First Published Jan 31, 2023, 8:36 AM IST

అమరావతి : వైసిపి నేత మాజీ మంత్రి వైయస్ వివాకానంద రెడ్డి హత్య కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.  సోమవారం నాడు నవీన్ అనే వ్యక్తికి సిబిఐ నోటీసులు ఇచ్చింది.  అయితే అతనుతాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉండే పవర్ఫుల్ వ్యక్తికి సహాయకుడు కావడంతో  ఇప్పుడు ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. నవీన్ తో పాటు మరొకరికి కూడా సిబిఐ నోటీసులు జారీ చేసింది. అతను కూడా అత్యంత ముఖ్యమైన నేతకు సన్నిహితుడే. 

వీరిద్దరినీ హైదరాబాదులోని సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈనెల 28న సిబిఐ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.  అతడిని దాదాపు నాలుగున్నర గంటల పాటు సిబిఐ విచారించింది. ఈ విచారణలో ముఖ్యంగా అతని కాల్ డేటా మీద ఆరా తీసింది. ఈ విచారణలోనే  అవినాష్ కాల్ లిస్టులో నవీన్ అనే వ్యక్తికి ఎక్కువసార్లు కాల్ చేసినట్లు తేలింది. ఈ క్రమంలోనే నవీన్ గురించి ఆరా తీసింది సిబిఐ. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నవీన్ అనే వ్యక్తి ఓ పవర్ఫుల్ వ్యక్తికి సన్నిహితుడని తేలింది. అంతేకాదు, సదరు వ్యక్తితో ఎవరైనా మాట్లాడాలన్నా, కలవాలన్న నవీన్ అనే అతనికి ఫోన్ చేయాల్సి ఉంటుందట.

వైఎస్ వివేకా హత్య కేసు.. ముగిసిన అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ, అన్ని విషయాలను చెప్పానన్న కడప ఎంపీ

అతను ఆ సమాచారాన్ని ఆ సదరు వ్యక్తికి తెలియజేసి ఆ తర్వాత అపాయింట్మెంట్ ఇప్పిస్తాడని సిబిఐ గుర్తించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి అదే నెంబర్ కు ఎక్కువసార్లు కాల్ చేసినట్లు సిబిఐ గుర్తించింది. దీంతో విషయం ఏంటో సమగ్రంగా ప్రశ్నించేందుకు నవీన్ కు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. వివేక హత్య కేసును స్పీడ్ అప్ చేసిన సిబిఐ.. సోమవారం వైయస్సార్ జిల్లా పులివెందులకు  చేరుకుంది. ముఖ్యమంత్రి జగన్ ఓఎస్ డి కార్యాలయానికి వెళ్లారు.

అక్కడ కార్యాలయ అధికారులను కలిశారు. కె. హరిప్రసాద్ తో పాటు మరికొందరి పేర్లని అడిగారు. వారు ఎక్కడ ఉంటారో ఆచూకీ ఆరా తీశారు. ఆ తర్వాత పులివెందులలోని పాత బస్టాండ్ మీదుగా ప్రయాణిస్తూ పూల అంగళ్లు, వివేకానంద రెడ్డి ఇంటి వరకు వెళ్లి పరిశీలించారు. అయితే జనవరి 28న అవినాష్ రెడ్డి విచారణ పూర్తయిన తర్వాత అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని సీబీఐ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిబిఐ అధికారులు పులివెందులకు వచ్చి పరిశీలించడం, పలువురు గురించి ఆరా తీయడం హాట్ టాపిక్ గా మారింది. 

ఫిబ్రవరి 10న విచారణకు హైదరాబాద్ కు రావాలని ఈ కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, అప్రూవర్గా మారిన డ్రైవర్ దస్తగిరి.. రిమాండ్ ఖైదీలుగా ఉన్న దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవులకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. అయితే వీరందరినీ విచారించే ముందే.. మరికొంతమందికి సిబీఐ నోటీసులు ఇచ్చి.. దర్యాప్తుకు పిలిచే అవకాశాలు ఉన్నాయని జరుగుతున్న పరిణామాల దృష్ట్యా తెలుస్తున్న సమాచారం.  మరోవైపు పులివెందుల చుట్టూ సిబిఐ ఉచ్చు బిగిస్తుండడంతో పలువురు నాయకులు పులివెందుల నుంచి వేరే ప్రాంతాలకు  వెళ్లినట్లుగా.. స్థానికంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios