వైఎస్ వివేకా హత్య కేసు.. ముగిసిన అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ, అన్ని విషయాలను చెప్పానన్న కడప ఎంపీ
ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. తనకు తెలిసిన అన్ని విషయాలను సీబీఐ అధికారులతో పంచుకున్నానని అవినాష్ రెడ్డి తెలిపారు.

వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు 4 గంటల పాటు ఆయనను సీబీఐ అధికారులు విచారించారు. అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని సీబీఐ అధికారులు చెప్పారని అన్నారు. కొంతమంది దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణలో సీబీఐకి సహకరిస్తానని ఆయన తెలిపారు. తనకు తెలిసిన అన్ని విషయాలను సీబీఐ అధికారులతో పంచుకున్నానని.. అయితే విచారణను వీడియో రికార్డింగ్ చేయాలని కోరగా అందుకు వారు అంగీకరించలేదని అవినాష్ రెడ్డి వెల్లడించారు.
ఇక, విచారణకు హాజరయ్యే ముందు.. సీబీఐ అధికారులకు వైఎస్ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలకు సంబంధించి ఆయన సీబీఐ అధికారులను రిక్వెస్ట్ చేశారు. తాను సీబీఐ విచారణకు హాజరవుతున్నట్టుగా తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రారంభమైన దగ్గరనుంచి తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపిన అవినాష్ రెడ్డి.. పనిగట్టుకుని ఓ వర్గం మీడియా లేనిపోని కథనాలను ప్రసారం చేస్తోందన్నారు. తప్పుదోవపట్టించేలా వార్తలను ప్రసారంచేస్తున్నారని అన్నారు. విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నట్టుగా చెప్పారు. ఆడియో, వీడియో రికార్డింగుకు అనుమతించాలని.. తనతో పాటు ఒక న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలని, తన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.
Also Read: సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి.. న్యాయవాదిని అనుమతించని అధికారులు..
మరోవైపు.. విపక్షాలపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినాష్ రెడ్డి విజయమ్మను కలిసినా రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టాలని టీడీపీ ప్రయత్నిస్తోందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. హత్య ఎవరు చేశారు.. ఎందుకు చేశారో ఇప్పటికే తేలిపోయిందని ఆయన అన్నారు. అవినాష్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలని కుట్ర పన్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. అవినాశ్ రెడ్డి విచారణ పారదర్శకంగా జరగాలని.. ఆయనకు పార్టీ పూర్తిగా అండగా వుంటుందని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. విచారణను వీడియో రికార్డింగ్ చేయాలని.. ఆయన విచారణ ద్వారా ప్రజలకు నిజాలు తెలిసే అవకాశాలు వున్నాయని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మాదిరిగా జగన్ సీబీఐ రాష్ట్రంలోకి రావొద్దని అనలేదన్నారు. విజయమ్మే మా అందరికీ పెద్ద దిక్కని, ఆమె దగ్గరికి వెళ్లి అవినాశ్ ఆశీర్వాదం తీసుకున్నాడని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.