భక్తిశ్రద్దలతో అమ్మవారికి భక్తులు సమర్పించే కానుకలు, నగదు విరాళాల విషయంలోనూ విజయవాడ దుర్గమ్మ ఆలయ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. 

కృష్ణా జిల్లా విజయవాడలోని ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ ఆలయ ఉద్యోగులు తీరు ఇప్పటికీ మారలేదు. భక్తిశ్రద్దలతో అమ్మవారికి భక్తులు సమర్పించే కానుకలు, నగదు విరాళాల విషయంలోనూ ఆలయ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇలా ఓ భక్తుడు అమ్మవారికి 10,116 రూపాయలు విరాళంగా ఇవ్వంగా రికార్డ్ అసిస్టెంట్ ఉమామహేశ్వరరావు వాటిని కాజేశాడు. భక్తుడి నుండి నగదు తీసుకుని కేవలం 100 రూపాయలకే రసీదు ఇచ్చాడు.

అయితే సదరు భక్తుడు బాండ్ కోసం ఆలయ ఈఓ భ్రమరాంబను కలిశాడు. దీంతో నగదు గోల్ మాల్ విషయం వెలుగులోకి వచ్చింది. భక్తుడిని మోసం చేసి డబ్బు కాజేయడానికి ప్రయత్నించిన రికార్డు అసిస్టెంట్ ఉమామహేశ్వర రావును ఈఓ భ్రమరాంబ వెంటనే సస్పెండ్ చేశారు. 

read more దుర్గగుడిలో నకిలీ సర్టిఫికెట్ల కలకలం... ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్

ఇదిలావుంటే దుర్గగుడి ఆలయ అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారంటే ఇటీవలే ఏసిబి, విజిలెన్స్ దాడులు చేపట్టాయి. దుర్గగుడిలో చోటు చేసుకొన్న అక్రమాలపై ఏసీబీ ప్రభుత్వానికి ఓ సమగ్ర నివేదికను కూడా సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా 20 మందికిపైగా ఉద్యోగులపై దేవాదాయశాఖ.వేటేసిన విషయం తెలిసిందే. అప్పటి ఈవో సురేష్ బాబు అక్రమాలపైనా ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందించగా ప్రభుత్వం ఆయనపై వేటేసింది. 

దుర్గగుడి ఆస్తుల విషయంలో ఏసీబీ తన నివేదికలో కీలక విషయాలను ప్రస్తావించింది. అమ్మవారి ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ఈ నివేదిక అభిప్రాయపడింది. వందల కోట్ల విలువైన భూములు, ఆస్తులను ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదని ఏసీబీ తన నివేదికలో పేర్కొంది. 3 ఏళ్లకు ఒక్కసారి ప్రాపర్టీ వివరాలను అప్‌డేట్ చేయాల్సి ఉంది. అయితే చాలా ఏళ్లుగా ఆస్తుల వివరాలను అప్‌డేట్ చేయడం లేదని గుర్తించింది.

మరోవైపు ప్రతి ఏటా ఆస్తుల వివరాలను నమోదు చేసే రిజిస్టర్ ను కూడ అప్ డేట్ చేయాలి. కానీ పదేళ్ల నుండి ఈ రిజిస్టర్ ను అప్‌డేట్ చేయడం లేదు.ఈ రిజిస్టర్ ను అప్‌డేట్ చేయకపోవడం వల్ల దుర్గమ్మ ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఏసీబీ తన నివేదికలో పేర్కొంది.